mt_logo

అక్రమ నీటి వాడకంపై నిలదీస్తాం: సీఎం కేసీఆర్

ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్ధ్య పెంపు అక్రమమేనని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంపై ఈనెల 25న జరిగే రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిలదీస్తామని అన్నారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి అధికారులతో చర్చించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం తెలిపారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని, ఏపీ ప్రభుత్వం కి ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలు అర్ధం పర్ధం లేనివని స్పష్టం చేశారు.

తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఏపీలో చేపట్టిన పాత ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్ చేశామని చెప్పారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరిస్తున్నదనే అంశాన్ని ఆధారాలతో సహా నిరూపించాలని ఆధికారులకు సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, జలవనరుల శాఖ సలహాదారు ఎస్.కే. జోషి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ. వినోద్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ నాగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *