mt_logo

ఏజెన్సీ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం : మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 326 ఆశ్రమ పాఠశాలలను ఎస్టీ అడ్వాన్స్‌డ్‌ రెసిడెన్షియల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌ గా అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలియజేశారు. వీటితోపాటు 1432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కూడా మోడల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌గా మార్చబోతున్నామని పేర్కొన్నారు. ఈ మొత్తం 1758 స్కూల్స్‌లో దాదాపు లక్ష ఇరవై వేల మంది విద్యార్థులు ఉండగా.. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ మీడియం బోధనలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్నాయి. గురుకుల పాఠశాలల విద్యార్థులు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. వీరిలాగే ఏజెన్సీ, అటవీ ప్రాంతాల విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *