వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వచ్చిన మంత్రుల బృందం మీడియాతో మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తాము రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. వానాకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చిందని, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో వరి కోతలే జరగలేదని, జనవరి 15 వరకు వరి కోతలు ఉంటాయని, 5 లక్షల ఎకరాల్లో మరింత వరి కోతకు సిద్ధంగా ఉందని చెప్పారు. నేటితో కేంద్రం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టార్గెట్ పూర్తవుతుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ పెంచాలని గతంలనే కోరినా ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేదో చెప్పాలని, ఎంత ధాన్యం వస్తే అంత కొంటామని కేంద్రం రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఇప్పటికే చేదు అనుభవాలు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని చెప్పారు. వానాకాలం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. బియ్యం మిల్లింగ్ తరువాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇతర దేశాలకు ఎగుమతిపై రాష్ట్రాలకు అధికారం ఉండదని చెప్పారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇచ్చి, తెలంగాణ రైతాంగం సమస్యలు వినాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.