mt_logo

విజయ డైరీ లక్ష్యం 1500 కోట్లు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విజయ డెయిరీ సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం అత్యధిక పాలను సేకరించి వినియోగదారులకు నాణ్యమైన పాలను, పాల ఉత్పత్తులను అందిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఔట్ లెట్ లకు అదనంగా మరిన్ని నూతన ఔట్ లెట్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా సుమారు 33 రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు వివరించారు. నూతన మార్కెటింగ్ విధానాలను అవలంభిస్తూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ టర్నోవర్ 800 కోట్ల రూపాయలుగా ఉందని, దానిని 1500 కోట్ల రూపాయలకు చేరుకొనే విధంగా, అలాగే త్వరలో ప్రారంభం కానున్న మెగా డైరీని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ సిద్ధం చేసుకొని, నిర్దేశించిన లక్ష్యాలను చేరే విధంగా కృషి చేయాలన్నారు. విజయ డెయిరీ ఔట్ లెట్ నిర్వహకులను మరింత ప్రోత్సహించే విధంగా అత్యధిక విక్రయాలు జరిపిన వారికి ప్రోత్సాహాకాలు అందించే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నేషనల్ హై వే అథారిటీ వారితో కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ టోల్ గేట్ ల వద్ద, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం GHMC పరిధిలో నిర్వహిస్తున్న అన్ని విజయ డెయిరీ ఔట్ లెట్ లలో తనిఖీలు జరిపి అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పుష్ కార్ట్ లు మరియు ఐస్ క్రీం ఫ్రీజర్ లను సబ్సిడీ పై అందించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు విజయ ఉత్పత్తులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి విజయ ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటూ.. ప్రభుత్వ సహకారం, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఫలితంగా నష్టాలలో ఉన్న విజయ డెయిరీ లాభాల బాట పట్టిందని, మరింత లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *