భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, సంవాద్ బృందం దేశవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం, ఆలనాపాలనలో తెలంగాణ ప్రభుత్వ సేవలను జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకు తెలంగాణ రాష్ట్రంలోని శిశువిహార్పై డాక్యుమెంటరీని రూపొందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా సంవాద్ బృందం జూన్ 22, 23, 24 తేదీల్లో శిశువిహార్ను సందర్శించనున్నదని అధికారులు శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని శిశువిహార్పై జాతీయ స్థాయి సంస్థలు డాక్యుమెంటరీ రూపొందించాలని నిర్ణయించడంపై తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించే స్థాయిలో తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఉన్నతమైన పనితీరు కలిగి ఉన్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతకు ఇది నిదర్శనమని ఆమె కొనియాడారు. అనంతరం శిశువిహార్ను సందర్శించి జాతీయ గుర్తింపు వచ్చేలా నిబద్ధతతో కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. శిశువిహార్లోని పిల్లల ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. మంత్రి వెంట మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద, జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వరరావు, ఇతర అధికారులున్నారు.

