mt_logo

కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్‌కు గడ్డి పెట్టిన టాలీవుడ్!

మంత్రి కొండా సురేఖకు, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నటులు గడ్డి పెట్టారు. నిన్న సినీ నటి సమంత, అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. పలువురు సినీ నటీనటులు స్పందించారు.

సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సెలబ్రిటీలు.. అనవసరమైన రాజకీయాల్లోకి తమని లాగొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని.. సినిమా రంగంలో పని చేసే వారిని సాఫ్ట్ టార్గెట్‌గా చూడకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు అస్సలు సహించబోమని స్పష్టం చేస్తూ.. తమ ఐక్యతను చాటిచెప్పారు.

నాగార్జున కుటుంబం, సమంతలతో పాటు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన వారిలో ప్రముఖ నటులు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని, రవితేజ, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, దర్శకుడు ఆర్జీవీ, తదితరులు ఉన్నారు. అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సురేఖ దిగాజారుడు కామెంట్స్‌ను సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించింది.

సురేఖ మాటలకు చిర్రెక్కిన సుధీర్ బాబు, వరుణ్ తేజ్ వంటి నటులైతే కాంగ్రెస్ పాలనపై కూడా సెటైర్లు వేశారు. పుకార్లను పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి సారించాలని.. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ కీర్తిప్రతిష్టలను మరింత దిగజార్చొద్దని సుధీర్ బాబు చురకలంటించారు. వరుణ్ తేజ్ అయితే ఇలాంటి పనికిమాలిన అంశాలను పక్కనపెట్టి అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ప్రజల తరపున, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్, హైడ్రా బాధితుల తరపున పోరాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎదుర్కోలేకనే సినీ నటులను లాగి టాపిక్ డైవర్ట్ చేద్దామని రేవంత్ రెడ్డి, కొండా సురేఖ ప్రయత్నించారని.. కానీ ప్లాన్ బెడిసికొట్టిందని ఇప్పుడు జోరుగా టాక్ నడుస్తుంది.

ఇప్పటికే హైడ్రా విషయంలో అనవసర దూకుడుతో కొండంత నెగెటివిటీని మూటగట్టుకున్న రేవంత్.. ఇప్పుడు కొండా సురేఖ నోటి దురుసును టాలీవుడ్ సీరియస్‌గా తీసుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నాడు. తనకు అనుకూలంగా ఉండే మీడియా కూడా ఈ అంశంలో చేతులెత్తేయడంతో రేవంత్ పూర్తి అయోమయంలో పడ్డాడు.