mt_logo

ఇందిరమ్మ రాజ్యం తెస్తానని రేవంత్ ఎమర్జెన్సీ పాలన తెచ్చిండు: హరీష్ రావు

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి మార్పు మార్పు మార్పు అన్నడు.. ఏం మార్పు తెచ్చిండు నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప. అశోక్ నగర్.లో నిరుద్యోగుల వీపులు పగులగొట్టిండు.. గిరిజనులపై నిర్బంధం ప్రయోగించిండు. ఇందిరమ్మ రాజ్యం తెస్తనని ఎమర్జెన్సీ పాలన తెచ్చిండు అని విమర్శించారు.

పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదని గుర్తుంచుకో రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇవాళ కేసులు, ఎఫ్ఐఆర్లు పోలీస్టేషన్లలో తయారవుత లేవు, గాంధీభవన్లో తయారవుతున్నయి. ఎవరిని అరెస్టు చేయాలో గాంధీభవన్‌లోనే నిర్ణయిస్తున్నరు. రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తున్నడు. పగ, ప్రతీకారంతో శాడిస్టిక్ ప్రెషర్‌తో పనిచేస్తున్నడు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నడు. ఏడాది పాలనలో ఫ్లైఓవర్, ఎస్టీపీ, కాళోజీ కళాక్షేత్రం ఇలా ఏదైనా కేసీఆర్ పాలనలో కట్టిందే. వాటినే నువ్వు ప్రారంభిస్తున్నవు తప్ప, నీ ఏడాది పాలనలో ఒక భవనం కట్టినవా? రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన నడుస్తున్నది అని దుయ్యబట్టారు.

ఏడో గ్యారంటీ అమలు కాలేదు, అక్రమ అరెస్టులు తప్ప మరే గ్యారంటీ అమలవుతలేదు. దేశ ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు అరెస్ట్ చేస్తరు అని రాహుల్ గాంధీ అడుగుతున్నడు. మరి తెలంగాణలో కూడా మీ సీఎం రేవంత్ అదే చేస్తున్నడు కదా. ముందు మీ ముఖ్యమంత్రిని బాగు చేయ్, లేదంటే మార్చెయ్ అని అన్నారు.

లగచర్లకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు మధుసూధనాచారి, పీఓడబ్లూ సంధ్య తదితరులు పోతే నీ ప్రభుత్వం ఏం చేసింది.. వారిపట్ల దారుణంగా ప్రవర్తించి, అవమానించింది కదా?అందుకే రాహుల్ గాంధీకి చెబుతున్నా.. ముందు నీ సీఎం రేవంత్ రెడ్డిని సరిచేయ్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఎంతకూ డబ్బులు సంపాదించాలె, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలె అనుకుంటున్నడు తప్ప పాలన లేదు అని హరీష్ రావు ధ్వజమెత్తారు.

ఏడాది పాలనలో మహిళలకు లక్ష కోట్ల రుణమన్నవు, అదంతా బోగస్. మహిళలకు మహాలక్షి పింఛన్ ఇస్తనన్నవు.. అదీ బోగస్. ఇవాళ నువ్వు మమ్మల్ని సలహాలివ్వాలని అడుగుతున్నవు.. మేం చాలా సలహాలిస్తున్నము, కానీ నువ్వు పాటిస్తలేవు కదా. మేం నీ పాలనను అడ్డుకుంట లేము కదా..రేవంత్, భట్టి ఇద్దరూ బాండ్‌పై సంతకాలు చేసి హామీనిచ్చారు. వరంగల్ డిక్లరేషన్ 9 హామీల్లో ఒకటి కూడా అమలు కాలేదు, మేం వాటినే అమలు చేయమని సలహా ఇచ్చాం కదా అని అన్నారు.

మూడుసార్లు రైతుబంధు ఇవ్వమని అడిగినం కదా.. అవ్వా తాతలకు 4 వేల పింఛన్ ఎపుడిస్తవు అన్నం కదా.. మూసీ గరీబోళ్ల ఇండ్ల కూలగొట్టద్దు అన్నం కదా.. అఖిలపక్షాన్ని పిలవమమన్నం, ఇది మా సూచన కాదా. కానీ, ఏ సూచన తీసుకునే విజ్ఞత నీకు లేదు అని విమర్శించారు.

నీవొక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నవు.. ఈ రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోంది. పోలీసులు, హోం గార్డుల సమస్యలు ఎందుకు పరిష్కరిస్త లేవు? 7 నెలల నుంచి పోలీసులకు టీఏలు ఇస్తలేవెందుకు? స్టేషన్ అలవెన్సులిస్తలేవు, సీసీ కెమెరాలు బాగు చేస్తలేవు. రైతులకు మద్దతు ధర లేదు, బోనస్ బోగస్ అయింది. రైతు రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎప్పుడిస్తవో చెప్పడం లేదు. అవ్వా తాతలకు పింఛన్ పెంచి ఎందుకిస్తలేవు? అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడనిస్తవా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఉపన్యాసమిచ్చినవా? నువ్వు మర్యాద లేకుండా బూతులు తిడితే మేం భరించాలా, నీకు సూచనలివ్వాలా? అని అడిగారు.

మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయిస్తవు.అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళితే ట్రెస్‌పాస్ అంటవు, అదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? ఎమ్మెల్యే ఇంట్లో చొరబడి, తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేస్తవు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 12 గంటల నుంచి బెయిలివ్వరు, మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నరు? దొంగరాత్రి టెర్రరిస్టును తీసుకుపోయినట్లు తీసుకపోతరా? నాంపల్లి కోర్టుకు కూడా తీసుపోలేదెందుకు.. ఏ సెక్షన్లు పెట్టాల్నో గాంధీ భవన్ నుంచి, సీఎం రేవంత్ నుంచి పోలీసులకు ఇంకా ఆదేశాలు రాలేదా? అందుకే ఈ ఆలస్యం చేస్తున్నారా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

ఇది ప్రజా పాలన కాదు, రాక్షసపాలన, పోలీసు పాలన, పీడిత పాలనగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు. వీళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని కూడా బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం అని అన్నారు.

పోలీసు అధికారులు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలని కోరుతున్నాం. కౌశిక్ రెడ్డిని విడుదల చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు, ఆయనకు అండగా ఉంటది. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా 12 గంటలు కష్టపడి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసిన జర్నలిస్టులకు, పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు అని అన్నారు.