mt_logo

కరోనా కట్టడిలో తెలంగాణ టాప్!!

కరోనా కేసుల కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదైన కేసుల కట్టడిలో ఆన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందుంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కరోనా వైరస్ నివారణలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు ఆర్ధిక సర్వే 2020-21 తెలిపింది. అంతేకాకుండా కోవిడ్ బాధితుల మరణాలు కూడా తక్కువే అని ఈ సర్వే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పకడ్బందీ ప్రణాళికలతోనే ఇది సాధ్యమైందని తెలంగాణ ప్రభుత్వంపై ఆర్ధిక సర్వే ప్రశంసల జల్లు కురిపించింది.

కరోనా వైరస్ ను అరికట్టే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,070 కోవిడ్ ర్యాపిడ్ టెస్టు సెంటర్లను ఏర్పాటు చేసింది. కరోనా టెస్టులు నిర్వహించి వైరస్ నివారణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి మెడిసిన్స్ అందించింది. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు వారి వివరాలను తెలుసుకుంటూ తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సానిటైజ్ చేస్తూ, మరోవైపు పరిశుభ్రత పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని హెచ్చరిస్తూ కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా ఆదివారం వరకు నమోదైన కరోనా కేసుల్లో తెలంగాణలో అత్యల్పంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 1,748 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 1,616 గా ఉంది. తమిళనాడులో యాక్టివ్ కేసుల సంఖ్య 4,275 కాగా, మరణాల సంఖ్య 12,413 గా ఉంది. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 797 అయినప్పటికీ కరోనా మరణాల సంఖ్య 7,162 గా ఉంది. మరోవైపు కేరళలో భారీ స్థాయిలో 63,577 యాక్టివ్ కేసులు ఉండగా, మృతుల సంఖ్య 3,971 కు చేరింది. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 33,269 కాగా, మృతుల సంఖ్య 51,489 గా ఉంది. కర్ణాటకలో యాక్టివ్ కేసులు 5,910 కాగా మరణాలు 12,263 గా నమోదు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *