mt_logo

తెలంగాణ సిబ్బందిని రిలీవ్ చేయని ఏపీపీఎస్సీ..

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఏమాత్రం సహించలేని ఏపీపీఎస్సీ అధికారులు కుట్రలకు తెరలేపుతున్నారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం 121 మంది సిబ్బందిని కేటాయిస్తూ నాలుగురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం తమ సిబ్బందిని తమకు అప్పగించాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసినా ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ సిబ్బందిని రిలీవ్ చేయకుండా ఏపీపీఎస్సీ అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా టీఎస్‌పీఎస్సీ కోసం పనిచేస్తున్న తెలంగాణ సిబ్బందిని ఏపీపీఎస్సీ ఇన్చార్జి సెక్రెటరీ దేవినేని రమాదేవి భయపెడుతూ వేధింపులకు గురిచేస్తునట్లు తెలిసింది.

ఏపీ సర్కారు కుట్రలవల్ల టీఎస్‌పీఎస్సీ నుండి రావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. తగినంత సిబ్బందిని కేటాయించుకుని ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తూ ముందుకు పోవాలనుకుంటున్న టీఎస్‌పీఎస్సీకి ఏపీ సర్కార్ కుట్రలతో మోకాలడ్డుతోంది. నిజానికి ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కావడంలేదు కాబట్టి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి పని వత్తిడి లేదని, అందుకే సిబ్బందిని టీఎస్‌పీఎస్సీకి కేటాయించడం ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ల పనులను వేగవంతం చేయవచ్చని పలువురు విద్యావేత్తలు, అధికారులు భావిస్తున్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ విభజన ఫైలు ప్రస్తుతం రాజ్ భవన్ కు చేరుకుంది. అయితే ఆ ఫైలును ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు, అందుకే ఆ ఫైలు అక్కడే పెండింగ్ లో ఉండిపోయిందని సమాచారం. ఇదిలాఉండగా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రాతపరీక్షల విధానం, సిలబస్ రూపకల్పనపై ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన 25 మంది సభ్యుల కమిటీ శుక్రవారం మొదటిసారిగా సమావేశం కాబోతున్నది. అయితే ఈ సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కూడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *