జూన్ 2 భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. యావత్ తెలంగాణ కలలుగన్న రోజు. జీవితంలో ఏ ఒక్కరూ మర్చిపోలేని రోజు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు పట్టలేని ఆనందంతో సంబరాలు నిర్వహించిన తీరు నభూతో నభవిష్యత్. తెలంగాణలోని ప్రతి పల్లె, పట్నం, ఊరు, వాడ, చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. జూన్ 1 అర్ధరాత్రి 12 గంటలకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ పది జిల్లాలలో మారుమోగిపోయాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక వేడుకలు, పటాకుల మోతలతో తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రజలు ఆహ్వానం పలికారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఉదయం 8.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు కేసీఆర్ గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం రాజ్ భవన్ చేరుకోనున్నారు. కేసీఆర్ తో పాటు మరో పదకొండు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా రాజ్ భవన్ ను సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు.
పోలీసులు అన్నివైపులా భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కేసీఆర్ భారీ కటౌట్లను, గులాబీ జెండాలను ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారం ముగియగానే పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరై నూతన ముఖ్యమంత్రి పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.57 గంటలకు సచివాలయంలోని సీ బ్లాకుకు చేరుకొని ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపడతారు.