ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్‌పై తిరుగుబాటుకు సిద్ధమైంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ అధికార డీఎంకే డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం సమర్పించింది.
బీజేపీకి గవర్నర్ రవి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, మత విద్వేషాలను రెచ్చగొట్టారని డీఎంకే ఆరోపించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని.. ఆయన వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని, గవర్నర్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.
అసెంబ్లీ అమోదించిన 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటికి ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించటానికే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని.. ఇటువంటి చర్యల్ని దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్ వ్యవహార శైలితో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అఘాతం వచ్చే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యక్తి గవర్నర్ పదవికి అనర్హుడని, ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి ఇచ్చిన మెమోరాండంలో తమిళనాడు ప్రభుత్వం కోరింది.