mt_logo

టీ హబ్ ఆవిష్కరణ నేడే!

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నిర్మించిన టీ హబ్ గురువారం ప్రారంభం కానుంది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ హబ్ దేశంలోనే ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన ఇంక్యుబేటర్ కావడం విశేషం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హాజరుకానున్నారు. ఐటీ రంగంలో స్టార్టప్ లకు ఉన్న అవకాశాలను, ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం ద్వారా హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చే విధంగా టీ హబ్ పేరుతో ఇంక్యుబేటర్ నిర్మాణానికి ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ విశేష కృషి చేశారు.

తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసే ఔత్సాహికులకు వర్క్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ను ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70వేల చదరపు అడుగులతో సొంత భవనాన్ని నిర్మించింది. ఈ భవన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 10కోట్లు కేటాయించింది. 1 జీబీ ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ వైఫై సౌకర్యం, అత్యున్నత సదుపాయాలతో జీ+5 పద్ధతిలో టీ హబ్ భవనాన్ని నిర్మించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐఐటీ, నల్సార్ యూనివర్సిటీ కూడా ఇందులో భాగస్వాములే. కేవలం మెంటార్లుగానే వ్యవహరించడం కాకుండా ఈ ప్రముఖ సంస్థలతో పాటు పలు దిగ్గజ కంపెనీలతో డైరెక్టర్ల బోర్డును కూడా ఏర్పాటు చేసింది.

టీ హబ్ లో ఇప్పటికే 120 స్టార్టప్ లకు అవకాశం ఇవ్వగా మరో 200 కంపెనీలు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని తెలిసింది. ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ స్టార్టప్ ల కోసం క్యాబిన్ లను బుక్ చేసుకుందని సమచారం. ఇదిలాఉండగా ఒకవైపు మొదటి దశ ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతూనే టీ హబ్ రెండో దశ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాయదుర్గంలోని ప్రతిపాదిత గేమ్ సిటీకి సమీపంలోని 15 ఎకరాల్లో టీ హబ్ ఫేజ్-2 క్యాంపస్ ఏర్పాటుకు ఐటీ మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండవ ఫేజ్ భవన నిర్మాణం సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుండగా, దీనికోసం రూ. 150 కోట్లు వెచ్చించి మూడేళ్ళలో పూర్తిచేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *