mt_logo

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ

– నెలాఖరులో నిర్వహణకు ఏర్పాట్లు.. వేదికలుగా ఎంసీహెచ్‌ఆర్డీ, అపార్డ్
– సీనియర్ అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్
– ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగులపైనా కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం వేదికలను, తేదీలను ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్డీ)లో బుధవారం పలువురు కీలక ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్లకు స్థానిక సంస్థల పరిపాలనపై పెద్దగా అవగాహన ఉండదు. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఏ విధంగా పనిచేయాలి? వాటి విధులేమిటి? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు వచ్చే నిధులేమిటి? వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? అనే అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయంగా తెలుస్తున్నది.

దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులకు హైదరాబాద్‌లో మూడు రోజులపాటు శిక్షణాతరగతులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నెలలోనే శాసనసభ బడ్జెట్ సమావేశాలు అయిపోతే, అనంతరం ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ బడ్జెట్ సమావేశాలు వచ్చేనెల మొదటివారానికి వాయిదా పడడంతో ఈ నెల చివరివారంలో మూడురోజులపాటు శిక్షణాతరగతులకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఎంసీహెచ్‌ఆర్డీతో పాటు, రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌లో ఈ తరగతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. అనుభవం ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ జెడ్పీ చైర్మన్లతోపాటు, పరిపాలనలో అనుభవజ్ఞులైన ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో శిక్షణ ఇప్పించనున్నారు.

సామాజిక సర్వేపై గ్రేడింగ్
ఆగస్టు 19న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర సర్వేలో సమర్థంగా పనిచేసిన అధికారులకు గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్లలో భద్రపరిచే పనిలో అధికార యంత్రాంగం పడింది. బుధవారం రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థకు వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ సర్వే సమాచారం కంప్యూటరీకరణను పరిశీలించారు. నూరుశాతం సమాచారం సేకరించిన వారికి ప్రోత్సాహకంగా గ్రేడింగ్‌లను ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

సర్వే పత్రాల్లో పొందుపర్చిన పూర్తి సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించిన ఎన్యూమరేటర్లు, నోడల్ అధికారులకు కూడా గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలకు కూడా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎన్ని జిల్లాల్లో సర్వే సమాచారం కంప్యూటీకరణ పూర్తయింది? ఇంకా పూర్తి కావాల్సిన జిల్లాలు ఏమిటి? అనే విషయం ఆరా తీసిన రేమండ్ పీటర్.. తప్పులు లేకుండా సమాచారాన్ని భద్రపర్చేవిధంగా అధికారులు, ఉద్యోగులకు సూచనలు ఇచ్చారు. ప్రజా ప్రతినిధులకు శిక్షణ వేదికగా ఆపార్డ్‌ను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున, ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై కూడా రేమండ్ పీటర్ అధికారులతో చర్చించారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై సీఎం దృష్టి
రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధికారుల కేటాయింపు అధికారికంగా జరుగనుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న పరిపాలనపరమైన వ్యూహాలను అర్థం చేసుకొని పనిచేసే అధికారులను ఎంపిక చేసుకునే పనిలో సీఎం ఉన్నారు.

బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కీలకమైన ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌లపైనా చర్చించినట్లు సమాచారం. తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో సమర్థులు, అంకితభావంతో పనిచేసే, పరిపాలనలో అనుభవం ఉన్నవారు ఎవరు? ప్రజలతో మమేకమై, ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త విధానాలను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించే అధికారులు ఎంత మంది? ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారుల ట్రాక్ రికార్డు ఏమిటి? అనే అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే అధికారులను ఎంపిక చేసుకొని ముఖ్యమైన శాఖల్లో నియమించుకోవాలన్నది కేసీఆర్ యోచనగా చెబుతున్నారు. కేంద్రం నుంచి తుది జాబితా రాగానే పూర్తి స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించి, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను పరుగెత్తించాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయమని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *