శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయా ఫ్లోర్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ పై చర్చ జరుగగా, ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెలతో పాటు పలువురు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం రెండో సెషన్ జరపాలని, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై సాయంత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశం కానుంది.
టీ బ్రేక్ అనంతరం బడ్జెట్ పై చర్చ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖామంత్రి పోచారం రైతుల ఆత్మహత్యలపై చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, పోచారం రైతుబిడ్డ అని, రైతుల సమస్యలు ఆయనకు తెలుసని అన్నారు. పోచారం తప్పకుండా సమాధానం ఇస్తారని, విపక్షాలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండా కోసం ఆందోళన చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.