mt_logo

సమైక్యరాష్ట్రం ఒక విఫల ప్రయోగం: ప్రొ॥ కోదండరాం

‘‘నేను గట్టిగా నమ్ముతున్న విషయం ఏందంటే ఇంక సమైక్య వాదానికి కాలం చెల్లిపోయింది. తాత్వికంగా కూడా అది సాధ్యం కాదు. కలిసి ఉండాలనేది ఒక భావన మాత్రమే’’ – ప్రొ॥ కోదండరాం

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ ప్రొ॥  ఇటీవల హెచ్‌ఎంటివి నిర్వహించిన చర్చాగోష్టిలో చాలా విస్పష్టంగా పై విధంగా ప్రకటించారు. విభజన సమయంలో తలెత్తుతున్న సందేహాలకు, కుహనా వాదనలకు ఆయన అద్భుతంగా సమాధానం చెప్పారు. తెలంగాణ చేతన, సోయి అక్కడ ప్రజలు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కూడా దోహదపడుతుందని వివరించారు. కొద్దిమంది పెట్టుబడిదారులు చేస్తున్న వాదనలతో ప్రజలు గందరగోళ పడాల్సిన పనిలేదని నొక్కి చెప్పారు. ఆ సంభాషణ పూర్తి పాఠం ‘బతుకమ్మ’కు ప్రత్యేకం.

సమైక్య వాదానికి కాలం చెల్లిపోయింది. అందులో సందేహమే లేదు. అయితే ఒక విషయం. నిజానికి ఒకే ఒక్క సందర్భంలో కలిసి ఉండాలనే తాత్విక భావన కోసం కొట్లాడవల్సి వచ్చింది. అది బెంగాల్ విభజన. ఇరు ప్రాంతాలు అంగీకరించినయి కాబట్టి, ఇరు ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నాయి కాబట్టి కుట్రపూరితంగా ఒక బలమైన శక్తి వాళ్ళ హక్కులు వాళ్ళకు చెందకుండా విడదీసిన సందర్భంలో ఐక్యత కోసం పోరాటం జరిగింది. పునరేకీకరణ కోసం పోరాటం జరిగింది. ప్రపంచంలో మరెక్కడా కూడా ఐక్యత కోసం పోరాటం జరుగదు. ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతాన్ని కలుపుకోవాలనేటువంటి డిమాండ్‌తో పోరాటం అనేది జరుగదు.

బలవంతపు పెళ్ళిళ్ళు ఎట్ల ఉండవో బలవంతపు ప్రాంతపు కలయికలు కూడా ఉండవు. ఇది సాధ్యం కాదు. ఈ విషయంపైన తెలంగాణ ప్రజలు దేశమేం కోరలేదు. వేరే రాష్ట్రం కావాలన్నారు. వేరే రాష్ట్రం ఉంటే అన్ని వ్యవస్థలలో మాకు గూడా భాగం దొరుకుతుంది. అస్తిత్వం ఉంటుంది. మా వనరులు మేం ఉపయోగించుకోగలం అనేది దీంట్లో ఉన్న పరమార్థం.

అన్ని పార్టీలు అంగీకరించినయి. కాంగ్రెస్ అయితే, 2000లో సిడబ్ల్యుసీలో తీర్మానం చేసింది. ఇవన్నీ గూడ సీడబ్ల్యుసీ తీర్మానంలో రాసింది. సిడబ్ల్యుసీ తీర్మానం అన్నింటిని కేటగరైజ్ చేసింది. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ ఎన్నో ప్రయత్నాలు జరిగినయి. దానికి అనుబంధంగా 2010లో చిదంబరం చేసిన ప్రకటన గూడ మీరు మళ్ళీ ఒకసారి చదివితే అనేక అనేక ప్రయత్నాలు జరిగిన సంగతి ధృవపడుతుంది. ఆంధ్రవూపదేశ్ అనేది ప్రత్యేక పరిస్థితులలో ఏర్పడ్డది. షరతులతో కూడిన విలీనం… ఉమ్మడి రాష్ట్రానికి ఒక ప్రాతిపాదిక ఏర్పర్చటానికి అనేకానేక ప్రయత్నాలు జరిగినయి. అవి విఫలమైనవి. విఫలమైన తర్వాత పోరాటాలు జరిగినవి. పోరాటాలు జరిగిన సందర్భంలో అనేక చర్చలు జరిగి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ‘చివరికి విభజన తప్పదు’ అని అన్ని పార్టీలు అంగీకరించినయి. అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాత అఖిలపక్షంలో 2009 డిసెంబర్ 7 నాడు తీర్మానం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 28, 2012న అఖిలపక్షం జరిగింది. చివరికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అనేకానేక చర్చలు జరిగిన తర్వాత ఇక విభజన అనివార్యమని నిర్ణయానికొచ్చారు. ఆయా పార్టీలు విభజనకు అనుకూలంగా నిర్ణయం చేసినై.

కనుక, ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో  జరుగుతున్న ఒక చర్చ మిథ్య. అంటే, ‘ఎకాఎకిన జరిగింది’, ‘ఎవరికి చెప్పకుండా జరిగింది’, ‘రావూతికి రాత్రి జరిగింది’ అనేవి వాస్తవం కావు. అనేక చర్చలు జరిగినై. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ప్రాంత నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతంలోని ప్రజలను సంసిద్ధులను చేయకపోతే అది వాళ్ళ తప్పు.

నేను ఒక మీటింగ్‌లో డాక్టర్ కోడెల శివప్ర సాద్‌ను ఒక ప్రశ్న అడిగిన. ‘మీరు ప్రకటన చేసిండ్రి గని, అమలు చేస్తరా?’ అని అడిగిన. ‘2009 ఎన్నికలకు ముందు కలిసి ఉండమన్నప్పుడు బలవంతంగా ఎన్నాళ్ళు ‘కలిపి ఉంచుతామండి. అందుకే మేం విభజనకు అనుకూలం’ అని చెప్పాడు. అంటే, ఇవాళ ఇంత చెప్పిం తర్వాత ప్రజల్ని అక్కడి నాయకులు ప్రిపేర్ చేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. కనుక, మనం మొట్టమెదటగా గ్రహించ వల్సింది ఏంటంటే ఇంకా ఎంతమాత్రం సమైక్యవాదం కలిపి ఉంచడం సాధ్యం కాదు. కానప్పుడు విభజన అనివార్యం అని గుర్తించి, ఆ విభజన అనివార్యం అనుకున్నప్పుడు మన చర్చకు ప్రాతిపదిక ఏంటనేది స్వీకరిద్దాం.

ఇవాళ మేం అందరికీ గూడ చెప్పేదేందంటే, మేం పదే పదే జేఏసీగా ప్రకటించేదేమంటే శాంతి, సహజీవనం, సామరస్యం అనేటువంటి పునాదుల మీద చర్చ జేసుకుందాం, పరిష్కరించుకుందామని!

ఇవాళ నిజానికి సిడబ్ల్యుసీ తీర్మానంలో కొన్ని అంశాలను గుర్తించి వాటి పరిష్కారానికి చట్ట బద్ధంగా వేదికలను ఏర్పాటు చేస్తాం అంది. ఆ విధంగా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందామంది. వీటన్నిటిని గూడ రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అంతర్భాగంగా చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇవాళ లేదని ఎవరన్నా అంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు.

నేటి సమస్య అందరికీ తెలుసు. గోదావరి నదీ పరీవాహక ప్రాంత నిర్మాణమే ఎట్లుంటది గద అంటే నీళ్ళు కింద వచ్చి చేరుతై. కావాలన్నా తెలంగాణ వాళ్లం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నీళ్ళను వాడుకోలేం.

నిజానికి, కృష్ణా నది జలాలకు సంబంధించి నిజాం కాలం నుంచి జరిగిన ఒప్పందాల ఫలితంగా ప్రతి ప్రాజెక్ట్‌కు కేటాయింపులు స్పష్టంగా జరిగినై. ప్రతి ప్రాంతానికి కేటాయింపులు స్పష్టంగా జరిగిపోయినై. ఇవాళ కొత్తగా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పందాలు అవసరం లేదు. వీటన్నింటి ఆధారంగా ఒక నిర్ణయం రావడానికి అవకాశముంది. ఇవన్నీ అందరికీ తెలిసి ఇవాళ కావాలని సమస్యను జఠిలం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నరు.

చర్చించుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తామని పదే పదే కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు మీరు చర్చకు ఒక ప్రయత్నం చెయ్యొచ్చు. మరి ఎందుకు ఇది జరగ కారణం ఒకటి, ఐదుకోట్ల మంది ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇయాళ కేంద్ర బిందువు కావడం లేదు. ఎవరు కేంద్ర బిందువు అయితున్నరంటే హైద్రాబాద్ కేంద్రబిందువు అవుతున్నది. నిజంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైద్రాబాద్‌లో తెలంగాణలో సెటిలైన వాళ్ళు కేంద్ర బిందువైతే వీళ్లు ఒక్క హైద్రాబాద్‌లోనే ఉన్నారండీ! మొత్తం తెలంగాణలో లేరా? నిజామాబాద్‌లో ఉన్నరు. వరంగల్‌లో ఉన్నరు. కరీంనగర్, మెదక్ ప్రతి జిల్లాలో ఉన్నరు. మహబూబ్‌నగర్‌లో ఉన్నరు. వాళ్ళందర్ని ఎక్స్‌క్లూజ్డ్ చేసి, వేరు చేసి ఒక్క హైద్రాబాద్ మీద చర్చ కేంద్రంగా ఎందుకు జరుగుతున్నది?

ఆలోచించండి. మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలు హైద్రాబాద్‌తో ముడిపడి లేవు. కొంత మందికి ఉన్నవి. మేం లేవనడం లేదు. యువకులు, విద్యార్థులు వాళ్ళ అవసరాలు కొంత హైద్రాబాద్‌తో ముడిపడి ఉండొచ్చు. అంతమాత్రం చేత మొత్తం అందరి జీవితాలు హైద్రాబాద్ చుట్టూ ముడిపడి ఉన్నట్లుగా ఇయ్యాళ ఏదైతే జర్చ జరుగుతుందో దాని వెనుకాల నా అభివూపాయంలోనైతే ఒక కుట్ర ఉంది.

రాజకీయ నాయకులకు అక్కడ ప్రాంత ప్రజల గురించి పట్టింపు లేదు. ఇక్కడ అంటే మొత్తం ఇతర తెలంగాణ జిల్లాల్లో నివసించే సీమాంధ్ర ప్రాంత ప్రజల గురించి పట్టింపు లేదు. ఒక్క పట్టింపు హైద్రాబాద్ పైనే ఉంది. ఎందుకు ఉన్నదని ఆలోచించమని మేం ఇయాళ సీమాంధ్ర ప్రజలను కోరుతున్నం.

పదే పదే మేం ఒక విషయం స్పష్టం చేస్తున్నం. హైద్రాబాద్ చరిత్ర గురించి గుర్తు చేస్తున్నం. మేం ఈ మాట దిగ్విజయ్‌సింగ్‌కి చెప్పినం. హైద్రాబాద్ నిర్మాణం జరిగినప్పుడే కులీకుతుబ్‌షా గారు అన్నరు. ‘‘చెరువులకు చేపలు వచ్చి చేరినట్లు హైద్రాబాద్ నిండా ప్రజలు వచ్చి చేరుదురుగాక’’ అని!

ప్రజలందరు అనేక ప్రాంతాల నుంచి వచ్చి సహజీవనం చేస్తూ ఇక్కడి సంస్కృతిని రూపుదిద్దిండ్రు. ‘గంగా జమున తెహజీబ్’అని మనం పదే పదే చెబుతున్నం. ఆ సంస్కృతి ఇవాళ హైద్రాబాద్ జీవన విధానానికి పునాది. ఎన్నో రకాల ప్రజలు వచ్చిండ్రు. ఇవాళ హైద్రాబాద్ జనాభాలో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇరవై శాతమా, ఒక్క శాతమా చర్చ అప్రస్తుతం. ఒక్క శాతమున్నా సున్నా పాయింట్ ఐదు శాతమున్నా వాళ్ళకి గూడ ఇక్కడ గౌరవవూపదంగా బతికే అవకాశముంది. ఉండాలని మేం పదే పదే నమ్ముతున్నాం. ఈ సాంస్కృతిక వారసత్వం వల్ల హైద్రాబాద్‌లో సమస్యలు రావనేది జేఏసీగా మా మొదటి ఆర్గ్యుమెంట్.. రెండవ మాట…భారత రాజ్యాంగం కింద అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి. సంక్రమిస్తయి.

పౌరులుగా ఆ సంక్రమించేటువంటి హక్కులు అమలు చేయించుకోవడానికి వ్యవస్థలు ఉన్నవి. మానవ హక్కుల కమీషన్ నుంచి హైకోర్టు దాకా… వాటన్నింటి నేపథ్యంలో హక్కుల పరిరక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పినం. చాలాసార్లు మూడో మాటగ గూడా చెప్పినం. ‘మీరు హైద్రాబాద్ తెలంగాణ రాజధానిగా అంగీకరించండి. ఆ చట్రానికి లోబడి మీ హక్కుల పరిరక్షణకు ఇంకేమైన ప్రత్యేక చర్యలు అవసరమైతే అవి గూడ ఆలోచించుకుందాం’ అనే మాట మేం చాలా రోజుల కిందటే చెప్పినం. జేఏసీగా ఇవ్వాళ చెప్తున్నం. సిడబ్ల్యుసీ తీర్మానంలో కూడా ఇదే ఉన్నది. అన్ని ప్రాంతాల హక్కుల పరిరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉంటదని వాళ్ళు స్పష్టంగా గుర్తించిండ్రు కూడా. దాని ఆధారంగా మిగతా చర్చలు చేసుకోవడానికి అవకాశముంది. భయాందోళనలు ఏమన్నా ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అది మిథ్యనా, వాస్తవమా అన్నది పక్కన పెట్టండి. నివృత్తి చేయాల్సిన బాధ్యత మా ఉద్యమంపై ఉంది.

ఇగ రెండో మాట, మేం మొన్న మా మిత్రుడు ఒకరింటికి పోతే అక్కడ ఆంధ్రా ప్రాంతం నుంచి తెలిసినాయిన వచ్చి ‘ఇక మేం మూటా ముల్లే సర్దుకుని పోవాలా?’ అన్నడు. అంటే. ఎందుకు ఈ ఆలోచన వస్తున్నది? తెలంగాణ ప్రజలను మీరు అవమాన పరుస్తున్నరు? ఎవర్ని గూడ ఎప్పుడు వెళ్ళిపొమ్మని అన్లేదే! అనేక సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ నుంచి మొదలుకుని మహబూబ్‌నగర్ దాకా అనేక మంది ఇక్కడకు వచ్చి బతికిండ్రు కదా. అరవై తొమ్మిది ఉద్యమం ‘ఆంధ్రా గో బ్యాక్’ అన్నది. ఈ ఉద్యమం ఒక మాట స్పష్టంగా చెప్తున్నది. మేం ఎవర్ని పొమ్మని అంటలేం. కని పెత్తనం మాత్రం వద్దని చెప్తున్నం.

గోరటి వెంకన్న స్పష్టంగా రాసిండు. సెక్ర చక్రం తిప్పుడు కుదరదని! మీరు ఏమన్నా చేయిండ్రి. మీరు నాటకాలు వేయండ్రి, వ్యాపారాలు చేసుకోండి. మీరు ఏమన్నా చేసుకోండ్రి. కానీ, పెత్తనం వద్దన్నం. కన్నాభిరాన్ ఒక అద్భుతమైన ఉత్తరం రాశిండు. ఆయన ‘పి.యు.సి.ఎల్. ప్రెసిడెంట్‌గా తెలంగాణ గురించి ఒక్క ఉత్తరం రాయరా సార్’ అని అడిగితే అప్పుడు ఆయన మన్మోహన్ సింగ్‌కు ఉత్తరం రాశిండు. ఆయన ఏం రాశిండంటే ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సీమాంధ్ర పెత్తనమే పోతుంది. కాని భారత పౌరులుగా సమానమైన హక్కులతో జీవించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి.’ అని!

ఆ రోజుల్లో కన్నాభిరాన్ రాసిన ఈ రెండు లైన్లు నాకు పదే పదే గుర్తుకొస్తయి. అంతటి అద్భుతమైన వ్యక్తీకరణ ఆ ఉత్తరంలో పేర్కొన్నడు. కనుక, ఈ అనుమానాలు, భయాలు వద్దంటున్నాను. ‘మీందుకు పోతరండి? మద్రాస్‌లో ఉన్నరు వెళ్ళిపోతున్నరా? బళ్ళారిలో మొత్తం తెలుగు వాళ్ళే. వెళ్ళిపోతున్నారా? ఇవాళ మొత్తం అమరావతి దాకా నాగ్‌పూర్ పైనా అంతా తెలుగు వాళ్ళు వెళ్ళి పోతున్నారా? అవతల బరంపురంలో లేరా? వెళ్ళి పోతున్నరా? తట్టా, బుట్టా సర్దుకుని వచ్చిండ్రా? ఇవన్నీ నిజానికి అనవసరంగా ఈ ప్రాంత ప్రజలను అవమానపర్చడం తప్ప మరొకటి కాదు. ‘‘ఈ పని చేయకండి. ఆ అవసరం రాదు.’’ ఇదే సంగతి అతడికీ చెప్పాను.

చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌లో రేపు విభజన జరిగితే పుట్టుక ఎక్కడ జరిగింది? ఇది సిక్స్ పాయింట్ ఫార్ములా గుడ ఇక్కడ అప్లై అయితది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే ఎవరు ఎక్కడ పనిచేయాలనేది నిర్ణయించడమవుతుంది. కానీ, మన ఇష్టా యిష్టాలు కాదు. నేను కోరుకుంటే అందరు వెళ్ళి పోవాలంటే ఐతదా? భారతదేశం గట్ల పనిచేస్తుందా? చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తది. పనిచేయపోతే అడుగడానికి వేదికలున్నయి. కొట్లాడటానికి ఇట్లాంటి పౌర నిర్మాణ సమితులు ఉన్నవి. ఇన్ని రకాల ప్రయత్నాలు ఉండగా లేనిపోని అపోహలను, భయాలను సృష్టించి ఇవాళ సెక్ర ర్యాలీలు తీస్తున్నరు. బయటికి రెండు సంకేతాలు పంపిస్తున్నరు. మొదటిది ఏందంటే ‘మొత్తం వాళ్ళేగద సర్ ఉన్నది’ అనే అర్థమైపోతుంది బయటికి. రెండోది, ‘ఏమన్నామని సర్ ఇన్ని రోజులు ఒక్కనాడు గూడ ఆందోళనలో ఏమీ అనలేదు కదా. ఎందుకిక్కడ ప్రత్యేకంగా లేని భయాన్ని ఎందుకు తీసుకొస్తున్నరు?’ అని!

కనుక, ఇది దేనికి దారి తీస్తుందనేది గూడా ఆలోచించాలి. బాధ్యత తెలంగాణ ఉద్యమం మీద ఉంటది. ఎందుకంటే, మేం తెలంగాణ కోరినం. రేపటి తెలంగాణ ఒక ప్రజాస్వామిక తెలంగాణగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి, మా బాధ్యత ఎక్కువగా ఉంటుంది.

మేం రేపు తప్పనిసరిగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మిస్తాం. అయితే, సీమాంధ్ర ప్రాంత మేధావులమీద, ప్రజాస్వామిక వాదుల మీద ప్రజలమీద ఒక బాధ్యత ఉంది. తమ తమ స్వప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చెప్పిన ప్రచారాన్ని నమ్మి తెలంగాణ ప్రజలమీద వాళ్ళు రెచ్చిపోయి చేసే వ్యాఖ్యానాలను మీరు నమ్మకండి. చర్చించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇది మేం స్పష్టంగా చెప్పదల్చినం.

హైద్రాబాద్‌లో ఉండే పిడికెడు మంది కోసం మొత్తం హైద్రాబాద్ కేంద్రం ఎందుకు చేస్తారండి? మీరు అంటున్నరు, ‘మా ప్రాంతం ఏం అభివృద్ధి చెందలేదని!’ ఎందుకు హైద్రాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేసింవూడని అడగండ్రి. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది కదా. మొత్తం ఇచ్ఛాపురం నుండి తడదాకా తీర ప్రాంతన్ని అభివృద్ధి చేయవచ్చు కదా. అక్కడ వ్యాపారాలు పెంచుకోవచ్చు కదా. అక్క డ కూడా ఓ సెంట్రల్ యూనివర్సిటీ వస్తది కదా. అద్భుతమైన రాజధాని నగరం నిర్మించుకోవచ్చు. చౌదరి గారు చెప్పినట్లు నాకు తెలియదు వాస్తవానికి. పది ఏండ్లలోనే ఐటీ సెక్టార్ వచ్చిందట. అక్కడ రాకపోదా ఇదంతా? ఈ అభివృద్ధి జరుగదా? అక్కడ అవకాశాలు కలుగయా? అక్కడ పరిక్షిశమలు రావా? హైద్రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న ఉద్యోగాలు ఎవరు తీస్తారండి! దానికి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఎవరు ఎక్కడ పని చేసుకుంటారో అక్కడ చేసుకుంటరు. ఇక్కడ నుంచి పోయి బీహార్ వాళ్ళు పంజాబ్‌లో పనిచేయ బొంబాయిలో చేయ ఎక్కడెక్కడో చేస్తున్నరు. ఈ అనుమానాలు, అనవసరంగా మనసులో పెట్టుకోవద్దని మేం చెప్పదల్చినం.

ఆఖరుగా ఇంకొక్క విషయం. జన జీవితం అంటే హైద్రాబాద్ ఒక్క ఇంత మంది ప్రజలు లేరా? వారికి హక్కులు లేవా? మాకివి కావాలని అడగండి. రాజధాని నగరం గిక్కడ కావాలి. గిట్ల ఉండాలి అని చెప్పి అడగండి. హైద్రాబాద్‌లో చార్మినార్ ఉంది. నాక్కూడ చార్మినార్ కావాలంటే అట్లా రాజధాని నిర్మాణం జరుగదు. రాజధాని నగరం ఇయ్యాలున్న పరిస్థితులను బట్టి ఇంతకన్నా మంచిగైతది గని చెడ్డగనైతే కాదు కదా.

ఎందుకు వీటన్నింటిని రభస చేసి ఈ ఉద్యమాలు సృష్టిస్తున్నరని మేం ఇయాళ అడుగుతున్నం. ఇవాళ ఆంధ్ర ప్రాంత నాయకులకు చెప్పేదేమిటంటే మీరు బలవంతులు. ఢిల్లీలో చక్రం తిప్పగలిగే శక్తి ఉంది. ఈ చర్చంతా మీరు నడుపలేరా? ప్రజలకు వాస్తవాలు వివరించి అర్థవంతంగా చర్చ నడిపి వారి హక్కుల పరిరక్షణకు కోసం గూడ మీరు చర్యలు తీసుకోలేరా? ఎందుకు ఇలాంటి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సూటిగా అడుగుతున్నం.

విభజన అంటూ జరిగితే రెండు ప్రాంతాల్లో బలహీన వర్గాలకే న్యాయం జరుగుతది. సామాజిక న్యాయం బలంగా పెరిగే అవకాశం ఉంది. ప్రజలు కేంద్రంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇయాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పట్టుపోతుందనే భయం ఉన్నట్లు నాకు బలంగా అనిపిస్తుంది. పట్టు బోయినట్లయితే ఏమైతది? ఈ రాజకీయాలే పెట్టుబడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇయాళ ఉన్న ఆంధ్ర ప్రాంత నాయకులు ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. వాటన్నింటికి మించి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డీలర్లు. వ్యాపారాలను తమ తమ రాజకీయ పరపతితో పెంచుకున్నారు తప్ప, ఎన్నడూ ప్రజల గురించి మాట్లడలేదు. తీర ప్రాంతం మునిగినా పట్టించుకోలే. ప్రజల భూములు బలవంతంగా గుంజుకున్నా ఆలోచించలేదు. అక్కడి ప్రజలు, రైతులు అనంతపురంలో నీళ్ళు దొరకకుండా ఆత్మహత్యలు చేసుకున్నా అడుగలేదు. ఏనాడు ఏ సమస్య గురించి పట్టించుకోలేదు. ఇయాళ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజల కోసం కాదు. తమ కోసం అనే మాట మేం బలంగా నమ్మవల్సి వస్తున్నది.

మేం ఇద్దర్నీ వేరు చేసి చూస్తున్నాం. ప్రజలు వేరు, రాజకీయ నాయకులు వేరు. ప్రజల సమస్యల పట్ల మాకు పట్టింపు ఉంటది. మేం ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళంగా కచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటాం. అదే విధంగా మేం ఆంధ్ర ప్రాంత ప్రజలకు చెప్పేది ఏందంటే మీ నాయకుల కళ్ళ నుంచి మమ్మల్ని చూడకండి. మీరు ఇన్ని రకాలుగా అంటున్నరు కదా. తెలంగాణ ప్రజల గుండెల్లో గుణపం గుచ్చేటువంటి విషయం ఏందంటే తెలంగాణ అనంగానే ‘మీకు మాట్లాడరాదు, మీరు తాగుబోతులు, మీరు సోమరులు’.. ఇవి నాయకులు అంటున్న మాటలు. మేం చూడంగనే హింస జేసే వాళ్లపూక్క కనిపిస్తమా? నిజంగా అదే అయితే తొంబై ఆరుల పుట్టిన ఉద్యమం హింసకు పాల్పడలేదు. ఎందుకు పాల్పడలేదు అంటే హింస ఎక్కడ ఉంటదో అక్కడ ప్రజల ప్రాతినిధ్యం ఉండదనే ఏకైక ఆలోచనతో హింస జరుగకుండా జాగ్రత్తపడ్డాం. ఇన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమం జన జీవితంలో ఒక భాగం చేసింది. మంచి, చెడు ఆలోచన చేసి ఎదుటి వాడికి నష్టం జరుగకుండా వ్యవహరించాల్సిన బాధ్యతను ఇవాళ ప్రజలకు నేర్పింది. అదే తెలంగాణ. దీనికి మీరు గర్వించాలి.

అనంతపురం నుంచి మాకో ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు కంగ్రాచ్యులేషన్స్  చెప్తే, ‘‘ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచిస్తరు. ఇన్ని రోజులు మేం జెప్తే విన్లేదు’ అన్న. ఆయన అన్నడు, ‘వాస్తవమే. ఇయాళ మే ం మా గురించి ఆలోచించడం మొదలు పెట్టినం’’ అన్నడు.

విన్నరు కదా! మీలో ఈ సోయి రగిలించిన ఘనత మాదే. మేం తప్పకుండా సంతోషిస్తున్నం. కానీ, ఇంతకంటే మంచిగ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగే శక్తి గూడ మీకున్నదని గుర్తిస్తున్నం. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోండి. అది మేం స్పష్టంగా చెప్పదల్చినం. మేం నిజంగా కారంచేడులో ఏ ఘటనలు జరిగినా, చుండూరులో ఘటనలు జరిగినా మేం బాధపడ్డాం. అక్కడికి పోయినం. అక్కడి ప్రజలతో ఉన్నం. మొత్తంగా ప్రకాశం జిల్లాలో అక్కడి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మేం పోయినం. చేపల చెరువు పేరుతో వ్యవసాయం దెబ్బతింటున్నప్పుడు అక్కడికి పోయినం. తీర ప్రాంతమంతా మత్స్యకారుల హక్కులు పోయి ట్రాలర్స్ వస్తున్నప్పుడు అక్కడికి పోయినం. మొత్తంగా అనంతపురంలో రైతులు ఆత్మహత్యలు జరిగినప్పుడు పోయినం. ఫ్యాక్షన్ ఘర్షణల వల్ల ప్రజలు హక్కులు కోల్పోతున్న సందర్భంలో పోయినం. ముప్పై సంవత్సరాలుగా సీమాంధ్ర ప్రజల జీవితాలతో సన్నిహిత సంబంధం ఉంది మాకు.

వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేసిన పోరాటాలతో సంబంధం ఉంది. పోరాటాలు చేసినా వ్యక్తులుగా మేం మాట్లాడుతున్నం. మా గురించి మేం మాట్లాడుకుంటున్నమంటే మిమ్మల్ని మర్చిపోయి మాట్లాడుకుంటలేం. ఇయాళ మేం స్పష్టంగా గ్రహించేది ఏందంటే తెలంగాణ అంటూ ఏర్పడితే ఆంధ్రా ప్రాంతంలో ఈ వర్గాలన్నీ రేపు తమ హక్కుల గురించి అడుగుతయి.

ఇదీ ఇయాళ ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులకు భయం కలిగిస్తున్న విషయం. వణుకు పుట్టిస్తున్నటువంటి విషయం. వాళ్ళని మీరు ప్రాతిపదికగా తీసుకోవద్దని చెప్పి నేను కోరుతున్న. మీరు ఆలోచించండి. నిజంగా సజయ గొప్ప విషయం చెప్పింది. ఇయాళ ఆంధ్రా ప్రాంతంలో పౌర సమాజం చితికి పోవడం, అది పూర్తిగా కుప్పకూలి పోవడం బాధ కలిగించే విషయం. అందరూ అంటరు. ‘మా విజయవాడలో ఏముందని!’. ఏం లేనప్పుడు ఇక్కడ ఎందుకుంటరయా. విజయవాడను ఎందుకు అభివృద్ధి చేయరు? గుంటూరును ఎందుకు చేయరు? ఒకప్పుడు అద్భుతమైన ఆంధ్రా ప్రాంతానికి ఆర్థిక, సాంస్కృతిక రాజధాని కదా. దాన్ని ఎందుకు డెవలప్ చేయరు? గుంటూరు అద్భుతమైనటువంటి రాజకీయ కేంద్రం గదా, దాన్ని ఎందుకు పట్టించుకోరు? ఇయాళ విశాఖపట్నం అంతర్జాతీయ పట్టణంగా ఎదుగుతున్నది గదా ఎందుకు అభివృద్ధి చేసుకోరు?

నిజంగా కడపలో ఒక అద్భుతమైన మల్టీ స్పెషాలిటీ దవాఖానా ఉంది, కానీ తడ నుంచి ఇచ్ఛాపురం దాకా మీరు ఇలాంటివి ఎందుకు అడుగరు? ఎందుకు మీరు ఇయాళ ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ గురించి ప్రయత్నం చేయలేకపోతున్నారు. పురందరేశ్వరి ఇంతకాలం హ్యూమన్ రీసోర్స్ మంత్రిగా ఉండి ఎందుకు ఒక విద్యాసంస్థను తీసుకురాలేకపోయింది. అడగండి మీరు. ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు అడగాల్సి వస్తుంది. ఎందుకంటే, మీకు తెలంగాణ ఉద్యమం ఇచ్చిన సోయి.

ఇది మంచి ఉద్యమం. ప్రజాస్వామిక ఉద్యమం. దీన్ని అర్థం చేసుకోండి. సానుభూతి చూపండి. మేం చాలా ఆశ్చర్యపడే విషయం, శ్రీకాకుళంలో థర్మల్ పవర్ స్టేషన్స్ పెడుతున్నరంటే కొట్లాడే వాళ్ళతో మేం కల్సినం. కలిస్తే ఏమన్నరంటే, మీరు తెలంగాణలో ఏం ఏం చేస్తున్నరో పేపర్లో చూసుకుని అవన్నీ పద్ధతులన్నీ పాటించి మేం మా హక్కుల కోసం పోరాడినమన్నరు. ఒక సానుభూతి ప్రజల మధ్య ఉంది. సాన్నిహిత్యమైన సంబంధం ఉన్నది. ఈ సంబంధాన్ని తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేం కాదని అంటామా? మేం తప్పనిసరిగా గౌరవిస్తాం. పక్కన తెలుగు వారి సాహిత్యం చదువుకుంటం. పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటం. మా సాహిత్యాన్ని మేం పెంపొందించుకుంటం. మా వ్యవసాయాన్ని మేం అభివృద్ధి చేసుకుంటం. ఇన్ని రోజులు చేసుకోలేకపోయినం.

ఏ పెద్దలు మీ దగ్గర చుండూరు, కారంచేడు చేసినోళ్లు.. గా పెద్దలు మమ్మల్ని అణిచేస్తున్నరు. మీరు అణచివేత పోవాల్నని మీరెట్ల కోరుకుంటున్నరో మేం గట్ల కోరుకుంటున్నం. మా జీవితాన్ని మేం బాగు చేసుకోవడానికి మేం ప్రయత్నం చేస్తున్నం తప్ప, మంది జీవితాన్ని చూసి కండ్లల్ల నిప్పులు పోసుకుంటలేం. మీ జీవితం మీది, మా జీవితం మాది. మమ్మల్ని మేం బాగు చేసుకుంటం. మీరు బాగుపడాలని కోరుకుంటున్నాం.

ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించండి. మీ ప్రాంతం గురించి ఆలోచించండి. దానికి కావాల్సిన ప్రయత్నాలు హక్కులు ఏవైనా చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేస్తున్న.

తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రజాస్వామిక విలువల కోసం వచ్చిన ఉద్యమం. ఆ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉంటది. గౌరవిస్తది. దాని ప్రాతిపదికన తెలంగాణ సమాజం పునర్నిర్మాణం కోసం గూడా ప్రయత్నం చేస్తది. అటువంటి సమాజంలో వివక్ష ఉండదు. ఏ ప్రాంతం వారిపట్ల ఉండదు. ఏ వర్గం వారిపట్ల ఉండదు అని హామీ ఇస్తూ అట్లాంటి ప్రాతిపదికన తెలంగాణ నిర్మించుకుంటాం. తప్పు జరిగితే అందరం గలిసి కొట్లాడుదాం. అందరి హక్కుల కోసం మేం గూడ నిలబడుతామని హామీ ఇస్తూ సహకరించవల్సిందిగా చేతులు జోడిస్తూ ఆంధ్రా ప్రాంత ప్రజలను కోరుతున్నాం.

విభజనకు మీరు పూనుకోక తప్పదు అని ఆంధ్రా ప్రాంత టీడీపీ, కాంగ్రెస్, వైకాపా నాయకులకు స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఆ దిశగా శాంతియుత విభజనకు తోడ్పడవల్సిందిగా కూడా వారిని కోరుతున్నాం. మీరు అడ్డం పడ్డా ఆగదు. అదిగూడ జెప్పదల్చినం. మేం తెచ్చుకుంటం తెలంగాణ. ఈడిదాకా నెట్టి కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించినోళ్ళకు అమలు చేయించడం కష్టమైన పని కాదు. అడ్డం పడే పని చేయకండి. మీ ప్రాంత హక్కుల కోసం మీరు నిలబడి విభజనకు సహకరించమని కోరుతున్నాం….

-జై తెలంగాణ

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *