ప్రజాసేవలో నిమగ్నమై ఉండాల్సిన ప్రభుత్వ శాఖలను రాజకీయ దుష్ప్రచారానికి రేవంత్ ప్రభుత్వం వాడుకుంటుంది అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని శాఖలను వాడుకొని.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేసే వాళ్లపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఇప్పటివరకు జరిగిన పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించి ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ మీద ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సర్క్యూలర్ ఫేక్ అని క్రిశాంక్ ఎత్తిచూపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురదచల్లాలనే నెపంతో రేవంత్ ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశారని స్పష్టంగా అర్ధమైనప్పటికి.. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్‌తో క్రిశాంక్ పై అక్రమ కేసు బనాయించారు.. రిమాండ్ కూడా చేసి సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు జైలుకు కూడా పంపించారు.
అలాగే.. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరక్టర్ దిలీప్ కొణతం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అక్రమ కేసు పెట్టింది. ఆర్టీసీ లోగో విషయంలో తప్పుడు ప్రచారం చేశాడని ఆరోపిస్తూ దిలీప్‌పై ఆర్టీసీ తరపున కేసు వేయించారు. వాస్తవానికి ఆర్టీసీ లోగో మారింది అని పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు, సదరు న్యూస్ ఛానెళ్ల సోషల్ మీడియా ఖాతాల్లో వేసిన కొత్త లోగోని దిలీప్ కేవలం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు పోస్ట్ చేసిన లోగోని షేర్ చేసిన పాపానికి.. ఆర్టీసిని వాడుకొని దిలీప్‌పై అక్రమ కేసు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.
ప్రముఖ జర్నలిస్ట్ రేవతి కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. కరెంట్ లేదని సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పోస్ట్ చేస్తే విద్యుత్ అధికారులు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారని రేవతి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే.. వివరాలు తీసుకొని సమస్యని పరిష్కరించాల్సిన విద్యుత్ శాఖ అధికారులు, సమస్యని బయటపెట్టిన జర్నలిస్ట్‌పై ఉల్టా కేసు పెట్టారు.
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారన్న నెపంతో పెట్టిన ఈ కేసులన్ని రాజకీయ ప్రేరేపితమైనవే అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలకి సేవలందించాల్సిన ప్రభుత్వ శాఖలు, సంస్థలను అధికార పార్టీ తమ వికృత రాజకీయ క్రీడలోకి లాగడం శోచనీయం.
ఇలాంటి అక్రమ కేసులు, హేయమైన చర్యల వల్ల తాము అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడటమే కాక.. సామాన్య ప్రజలకు ప్రభుత్వ శాఖలు, అధికారులపై నమ్మకం సన్నగిల్లితుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన ప్రతీకార రాజకీయాల కోసం ప్రభుత్వ శాఖలను వాడుకోవటం మానేయాలి.