mt_logo

రియల్ లీడర్.. రాజకీయ ప్రస్థానం

-స్వరారాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు.. రేపు సీఎం కే.చంద్రశేఖర్‌రావు జన్మదినం..
-రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు.. స్వరాష్ట్రంలో అధినాయకుడు
మన నీళ్లు దారి మళ్లిన వేళ.. నిధులు పక్కకు తరలిన వేళ.. ఉద్యోగాలు దక్కని వేళ.. మన బతుకమ్మను గుర్తించని వేళ.. ఒకే ఒక్క పిడికిలి పైకి లేచింది… జై తెలంగాణా అని నినదించింది. వేలు, లక్షలు, కోట్లాది గొంతుకలై చైతన్యాన్ని తట్టి లేపింది. ప్రత్యేక లక్ష్యాన్ని చూపి జంగ్ సైరన్ మోగించింది. ఆటంకాలు, అవమానాలు, కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి సకల జనుల సమరం చేసి గమ్యాన్ని ముద్దాడింది. కలలు గన్న తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లెదుట నిలిపింది. జై కొట్టి నిలిచి గెలిచిన ఆ ఒకే ఒక్కడే మన కేసీఆర్.. రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా రియల్ లీడర్‌పై ప్రత్యేక కథనం..

తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పట్టుదలతో మొండిధైర్యంతో ముందుకెళ్లి ఆరు దశాబ్దాల పాటు సీమాంధ్రుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచి స్వయం పాలనను అందించిన ఘనత నాటి ఉద్యమ దిక్సూచి.. నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కుతుంది. 14 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటంలో అవమానాలు ఎదురైనా అడుగు ముందుకే వేసిన పోరాట యోధుడు. సీమాంధ్రుల కుట్రలను చేధించి, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ధీరోదాత్తుడు కేసీఆర్. 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో జన్మించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ సాధించి నాలుగున్నర కోట్ల ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. రేపు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేకం కథనం…

రాజకీయ ప్రస్థానం…
ఎంఏ తెలుగు పూర్తిచేసిన కేసీఆర్ 1970 యూత్ కాంగ్రెస్‌తో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత 1983లో టీడీపీలో చేరి సిద్దిపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నడూ ఓటమిని చవిచూడలేదు. 89, 94, 99 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న కేసీఆర్ 1987-88లో, 1996లో మంత్రిగా పని చేశారు. 1999లో విజయం సాధించి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన పూర్తిగా బోరుబావులపై ఆధారపడిన రైతాంగంపై విద్యుత్ చార్జీల భారం మోపిన అప్పటి టీడీపీ (చంద్రబాబు) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిప్యూటీ స్పీకర్ పదవి, శాసనసభ్యత్వం, తెలుగుదేశం పార్టీకి 2001 ఏప్రిల్ 27న రాజీనామా చేశారు. అదే రోజున హైదరాబాద్ జలవిహార్‌లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పార్టీని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

కుట్రలను ఛేదిస్తూ ముందుకు..
తెలంగాణ కోసం పరితపిస్తున్న అనేకమంది మేధావులతో రాత్రింబవళ్లు చర్చలు జరిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశీర్వాదంతో ముందుకు కదిలారు. ఉద్యమం బలోపేతం కావాలంటే భావవ్యాప్తి కావాలన్న జయశంకర్ సార్ సూచనమేరకు ఆ దిశగా అడుగులు వేశారు. కరీంనగర్‌లో తొలి సభను ఏర్పాటు చేసి కదనభేరి మోగించారు. మొదటి సభకే నాలుగు లక్షలకు పైగా జనం తరలిరావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు ప్రజాస్వామ్య పద్ధతిలో తాను పదవికి రాజీనామా చేసిన సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి అధికార తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉహించని విజయం అందుకున్నారు. రెండు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలమన్న కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించారు.

అనంతరం కేంద్రం మాట తప్పడమే కాకుండా అప్పటి సీఎం రాజశేఖర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌పై కుట్రలకు తెరలేపారు. అయినా వెనకడుగు వేయలేదు. 2008లో టీడీపీ తెలంగాణకు అనుకూల తీర్మానం చేయడంతో 2009 ఎన్నికల్లో జత కలిశారు. కానీ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు కుట్రలతో టీఆర్‌ఎస్‌ను ఓడించారు. అయినా ధైర్యంతో ముందుకే సాగారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో అని ప్రకటించి 2009 నవంబర్ 29న నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఉద్యోగ సంఘాలు, జయశంకర్‌ సార్ వంటి ప్రముఖులు వారించినా మొండి పట్టుదలతో దీక్షను కొనసాగించారు. దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు కేసీఆర్‌ను అరెస్టు చేయడంతో యావత్ తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుండడంతో నిమ్స్‌కు తరలించారు. కేసీఆర్ దీక్షతో ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్యమం రాజుకుంది. అప్పటినుంచి నగరం ఉద్యమ కేంద్రంగా మారింది.. ఆ వెనుకే యావత్ తెలంగాణ కదిలింది. ఓయూ విద్యార్థులు ఉద్యమం ఉధృతం చేశారు. కేసీఆర్ దీక్షతో పాటు విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. దీక్ష 11వ రోజుకు చేరింది. చంద్రశేఖర్‌రావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఎట్టకేలకు దిగి వచ్చిన కేంద్రం డిసెంబర్ 9న రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసింది. ఉద్యమ నాయకులు కేసీఆర్‌తో అదే రాత్రి దీక్ష విరమింపజేశారు. తెల్లారేసరికి సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏకమై రాజీనామాల పేరుతో కుట్రలకు తెరలేపాయి. వచ్చిన తెలంగాణను వెనక్కి వెళ్ళేలా చేశాయి. ఈ క్రమంలో కేసీఆర్ తెలంగాణ రాజకీయ నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. కాంగ్రెస్, టీడీపీలు వెనుకడుగు వేసినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.

హైదరాబాద్ కేంద్రంగా…
కేంద్రం వెనుకడుగు వేయడంతో ప్రజలను జేఏసీ ఆధ్వర్యంలో మమేకం చేసి ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు నడిపించిన చరిత్ర కేసీఆర్‌దే. వంటావార్పు, రహదారుల దిగ్బంధం, సాగరహారం, సకలజనుల సమ్మె, చలో అసెంబ్లీ, రాస్తారోకో, బంద్‌లతో పాటు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎప్పటికప్పుడు సమయానుకులంగా నిర్ణయాలు తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచారు.

చివరకు 2014లో పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరే సమయంలో ఏపీ నుంచి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పి వెళ్లిన కేసీఆర్ ఢిల్లీలో అనేక పార్టీల నేతలతో మాట్లాడి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా చేశారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు అనేక కుట్రలకు తెర లేపినా పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పక తప్పదు.

కేసీఆర్ జన్మదిన వేడుకలకు మైనార్టీ వర్గాల సన్నాహాలు
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముస్లిం మైనార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఇదే విషయమై గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదివారం మాట్లాడుతూ నగరంలోని అంధుల పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తామన్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *