సమాజాన్ని పట్టిపీడిస్తున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఓరుగల్లు పల్లెలు సిద్ధమయ్యాయి. అధికారుల సహకారంతో నాలుగు నెలల్లో 265 గ్రామాల్లో గుడుంబా నిషేధం అమలుచేస్తున్నారు. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ సంవత్సరం జనవరిలో నాలుగురోజులపాటు వరంగల్ లో బస చేసిన సీఎం కేసీఆర్ గుడుంబా వల్ల అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విని చలించిపోయారు. చిన్నవయసులోనే గుడుంబా మహమ్మారి వల్ల భర్తలను కోల్పోయిన వితంతువుల దీనగాధలను విన్న ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సీఎం గతంలో కలెక్టర్ల సమావేశంలో, ఇటీవల జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమాల్లో గుడుంబా బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఎక్సైజ్, పోలీసు అధికారులతో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పలు సమావేశాలు జరిపి గుడుంబాను అరికట్టేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీనివల్ల జరిగే అనేక అనర్ధాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో 265 గ్రామాల ప్రజలు గుడుంబా విక్రయం, తయారీని ప్రోత్సహించబోమని తీర్మానం చేశారు. అంతేకాకుండా గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుంటూ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇదిలాఉండగా గుడుంబా తయారీకి మూలకారణమైన బెల్లం రవాణాదారులు, విక్రేతలపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమయ్యారు. బెల్లం మాఫియాపై కఠిన చర్యలు తీసుకునే దిశగా రౌడీ షీట్లు కూడా తెరిచారు. మరోవైపు గుడుంబా తయారీదారులు, విక్రేతలకు ఉపాధి మార్గాలు చూపుతామని జిల్లా యంత్రాంగం హామీ ఇస్తున్నది. జిల్లాలో ఎంతమంది గుడుంబా పరిశ్రమపై ఆధారపడ్డారు? వారి ఆర్ధిక స్థితిగతులు ఏమిటి? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి యోగ్యతను బట్టి ఉపాధి మార్గాలు చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.