ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం కింగ్ కోఠిలో ఉన్న నిజాం పరదా ప్యాలస్ ను సందర్శించారు. సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని తెలిసిన సీఎం ప్యాలస్ ను పరిశీలించారు. దీనిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్మాణానికి కానీ, చారిత్రక వారసత్వ సంపదగా గానీ, లేదా ఇతర ప్రభుత్వ పరమైన అవసరాల కోసం గానీ ఉపయోగించుకుంటే బాగుటుందని కేసీఆర్ భావించారని తెలిసింది.
మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరితో కలిసి అక్కడికి వచ్చిన సీఎం సుమారు అరగంటపాటు అక్కడ గడిపారు. ప్రభుత్వ అవసరాల కోసం భవనాన్ని ఉపయోగించుకునే ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. అనంతరం ఎర్రమంజిల్ కాలనీలోని రహదారులు, భవనాల శాఖ నూతన కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కేసీఆర్ ఆ పక్కనే ఉన్న రామకృష్ణానగర్ బస్తీలో కూడా పర్యటించారు.