గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభకు బుధవారం నామినేషన్ వేసినతర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ దొర, గడీలపాలన వస్తుందని కాంగ్రెస్, టీడీపీ నేతలు అంటున్నారు. ఎక్కడి గడీల పాలనో అర్థంకావట్లేదు. గుణం ముఖ్యం. కులం కాదు. నేను దొరలాగా ఉన్నానా? నాకు చరిత్ర లేదా? సిద్దిపేటలో 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా. ఎక్కడైనా దొరలాగా ప్రవర్తించానా? ప్రజల మధ్య కలిసిపోయి పనిచేశాం తప్ప ఎన్నడూ దొరలాగా పని చెయ్యలేదని’ కేసీఆర్ అన్నారు.
సమైక్యవాద శక్తులు, ఆంధ్ర శక్తులు ఇంకా మనల్ని పట్టి పీడిస్తాయని, ఇన్ని రోజులుగా కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు ఏమీ చెయ్యలేదని, ఎన్నికల మేనిఫెస్టోలో మేం చెప్పినవన్నీ చేసి చూపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలని పేర్కొన్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనం నిండా మునిగిపోతామని, పదహారు లేదా పదిహేను ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఢిల్లీని శాసించవచ్చని, రెండు ఓట్లూ టీఆర్ఎస్ ప్రభుత్వానికే వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్ షిప్ గా తయారు చేస్తామని, నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, రమణాచారి, మాజీ డీజీపీ పేర్వారం రాములు తదితరులు పాల్గొన్నారు.