mt_logo

ఉపన్యాసం ఇచ్చుడు ఉత్త చేతులతో పోవుడు మోడీకి అలవాటే : మంత్రి కేటీఆర్ 

• గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనం

• నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని  వ్యవసాయం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే

• కేంద్ర ఏజెన్సీల బూచి చూపించి ప్రధాన చేసిన హెచ్చరికలకు, ఉడత ఊపులకు మేం భయపడం

• తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో పోవడం మోడీకి అలవాటుగా మారింది.

ప్రధాని మోడీ ప్రసంగం పై బీఆర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిరిగా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధానమంత్రి మాటలు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి, 700 రైతుల మరణాలకు కారణమైన ప్రధానమంత్రి ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం అన్నారు.  తెలంగాణ వ్యవసాయ రంగం అన్ని సూచీల్లో ముఖ్యంగా, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి మొదలుకొని  పెరిగిన విస్తీర్ణం,  సాగునీటి విప్లవం, రైతు సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయం ప్రధానమంత్రి మోడీ తెలుసుకుంటే మంచిది అని హితవు పలికారు.  కార్పొరేట్ మిత్రులకు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసే అవకాశం ఉన్నా, ఎందుకు ఇప్పటిదాకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనం

ఆదివాసీ గిరిజనుల సంక్షేమం గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పటికీ, పార్లమెంట్ సాక్షిగా దక్కిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు వ్యవహారాన్ని కేంద్రం తొక్కిపెట్టి వేలాదిమంది గిరిజన, ఆదివాసీ యువకుల ఉన్నత విద్య అవకాశాలను మోదీ ప్రభుత్వం దెబ్బతీసిన విషయం ప్రతి ఒక్క గిరిజన, ఆదివాసి బిడ్డకు తెలుసన్నారు.  ప్రధానమంత్రి మోడీ కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన దానికంటే దారుణంగా ఉందన్నారు. బీజేపీలో అనేక రాష్ట్రాల్లోని నాయకుల కుటుంబ సభ్యులు, స్వయంగా తన క్యాబినెట్ లోని మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే అనే విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుంచుకుంటే మంచిదన్నారు. 

కేంద్ర ఏజెన్సీల బూచి చూపించి ప్రధాన చేసిన హెచ్చరికలకు, ఉడత ఊపులకు భయపడం

తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి, వారి సర్వతోముఖాభివృద్ధికి  పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల పైన కేంద్ర ప్రభుత్వ  ఏజెన్సీలతో విచారణ చేపిస్తామంటూ ప్రధానమంత్రి అన్న మాటల పైన కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులతో కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం మాది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మహాయజ్ఞంలా కృషి చేస్తామని తెలిపారు.