mt_logo

మార్పే ఆయన లక్ష్యం

విప్లవం అంటే ఏమిటి?
ఆవిష్కరణ! నిర్మూలనా! లేదా..
ఒకదాన్ని నిర్మూలించి మరోదాన్ని ఆవిష్కరించడమా?
అది హింస ద్వారానా! అసింహతోనా..!

ఇలాంటి ప్రశ్నలన్నింటినీ పక్కకు నెట్టి దేశ ప్రజల ముందుకొచ్చింది హరిత విప్లవం. దీని గురించి గర్వంగా చెప్పుకున్న దేశం ముందు ఓ సాధరణ వ్యక్తి సంధించిన ప్రశ్నలు ఇవాళ యావత్ సమాజాన్ని ఆలోచనలో పడేశాయి. ఆయనే సుభాష్ పాలేకర్. రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న కృషీవలుడు. లక్షలాది సూక్ష్మ జీవుల్ని అంతం చేసి, పక్షులు, భూమి, నీరు , పర్యావరణానికి సైతం హాని చేకూర్చే వ్యవసాయ పద్ధతి విప్లవం కాబోదంటున్నారు. మానవుల్లో సైతం క్యాన్సర్, డయాబెటీస్, హృద్రోగం వంటి వ్యాధులు పెరగడానికి హరిత విప్లవమే కారణమంటున్నారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానంపై సేవ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఉచిత శిక్షణ శిబిరంలో ప్రసంగించేందుకు నగరానికి వస్తున్న సందర్భంగా పాలేకర్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు రైతులను డీలా పడేస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం భూమిని, నీటిని, పర్యావరణాన్ని కలుషితం చేయడంతోపాటు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలే కారణమంటున్నారు సుభాష్ పాలేకర్. అందుకు ప్రతిగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది రైతులు పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారంటే అది పాలేకర్ కృషి ఫలితమే.

అహింసా మార్గం..
సుభాష్ పాలేకర్ 1949లో మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. నాగ్‌పుర్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన ఆయన కాలేజీ రోజుల్లోనే.. ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 1972లో తన తండ్రితో కలిసి పురాతన వ్యవసాయ పద్ధతిని ప్రారంభించారు. భారతీయ ప్రాచీన తత్వశాస్త్ర ప్రభావంతో వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రాచీన గ్రంథాల అధ్యయనం చేశారు. గాంధీ, మార్స్ వంటి సమకాలీన రచనల్ని అధ్యయనం చేసిన ఆయన గాంధీ ఆలోచనలకు దగ్గరయ్యారు. గాంధీ, శివాజీ, జ్యోతిబాపూలే, స్వామి వివేకానంద, ఠాగూర్ వంటి మహానుభావులు బోధించిన అహింసా మార్గమే ఈ దేశానికి ఆచరణీయమని విశ్వసించారు.

రసాయనాల వినియోగంతో..
1972 నుంచి 1985 వరకు రసాయనాల వినియోగంతో సేద్యం చేసిన ఆయన అందులోని లోపాల్ని అన్వేషించే పనిలో పడ్డారు. సాంకేతిక సహాయంతో అధిక దిగుబడిని సాధించవచ్చని చెప్పే హరిత విప్లవంలో లోపాల్ని ఎత్తిచూపుతూ కెమికల్ ఫార్మింగ్‌కి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. ఆదివాసీ ప్రజలతో పనిచేసే కాలంలో వారి జీవన శైలి సాంఘిక నిర్మాణాల్ని లోతుగా అధ్యయనం చేశారు పాలేకర్. పెద్ద పెద్ద చెట్లు, వాటి నుంచి లభించే ఫలాలు చూసి ఆశ్చర్యపోయారు. అటవీ వృక్షాల సహజసిద్ధ అభివృద్ధిపై రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. ఆరేళ్లపాటు తన ఫాంలో ప్రకృతి సేద్యాన్ని చేసి దాదాపు 154 పరిశోధనలు చేశారు. పరిశోధన అనంతరం ఆయన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సిస్టాన్ని కనిపెట్టారు.

విస్తృత ప్రచారం..
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై పాలేకర్ దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లో పుస్తకాల్ని ప్రచురించారు. శిక్షణ శిబిరాలు, సదస్సులు నిర్వహించి రైతాంగంలో అవగాహన కల్పించారు. 1996నుంచి 98 వరకు బలి రాజా అనే మరాఠీ వ్యవసాయ పత్రిక సంపాదక సభ్యుడిగా చేశారు. దాదాపు 20 మరాఠీ, 4 ఇంగ్లిష్, 3 హిందీ పుస్తకాలను రాశారు. ఆయన రచనలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేశారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, మేధావులను వ్యవసాయ రంగంలో అసలైన సమస్యలను గురించి ఆలోచింపజేస్తున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానం రైతులకు ఎంతో ఉపకరిస్తుందనేది పాలేకర్ వాదన. విషరహిత ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు కూడా ఇదొక్కటే మార్గమంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ తదితర రాష్ర్టాల్లో దాదాపు 30 లక్షల మంది రైతులు ఈ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. తన సేవలకు గాను.. 2005లో బసవ శ్రీ అవార్డు, శ్రీ మురుఘ మత్, చిత్రదుర్గ వంటి ప్రఖ్యాత అవార్డులను పొందారు. కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం భారత్ కృషి రత్న అవార్డును అందజేసింది. శ్రీ రామచంద్రపురమత, కర్ణాటక షిమోగ గోపాల్ గౌరవ్ అవార్డుతో సత్కరించింది.

అవగాహన సదస్సు..
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం మారుతి గార్డెన్ (నిలోఫర్ ఆస్పత్రి దగ్గర)లో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6.30 వరకు శిబిరం కొనసాగనుంది. వివరాలకు ఫోన్ నం. 8686871048లో సంప్రదించవచ్చు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *