mt_logo

ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి: కేటీఆర్

ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు.. ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారు. ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదు. అధికారం కోసం అబద్ధాలు.. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు చెబుతున్నారు అని దుయ్యబట్టారు.

పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను.. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారు. ఇప్పటికైనా కల్లు తెరవండి.. వర్షం కురుస్తుందో? లేదో? సాగునీరు అందుతుందో? లేదో? కరెంట్ వస్తుందో? లేదో? పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో? లేదో? తెలియకున్నా.. భూమిని నమ్మి సేద్యం చేసి.. ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వండి అని కేటీఆర్ సూచించారు.

అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపకండి.. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకకండి అని అన్నారు.