కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, కౌలు రౌతులకు పైసలిస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. మహిళలకు రూ. 2500, ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరికీ 4 వేలు అన్నాడు.. తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి చెప్పిండు. రంగుల కలలాంటి సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని దుయ్యబట్టారు.
ఈ ఐదు నెలల్లోనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయి. అన్ని వర్గాలు కోపంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా చెబుతున్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తి చేసినట్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి బొంకుతున్నాడు అని అన్నారు.
మహిళలకు రూ. 2500 వచ్చినయా? ఫించన్ 4 వేలు కాదు ఒక నెల 2 వేలు ఎగగొట్టిండు, రైతు భరోసా అంటూ అబద్ధాలు చెబుతున్నాడు.. రుణమాఫీకి ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు తేదీలు మార్చుతుండు. ఎక్కడి వెళ్లినా సరే ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి చేస్తుంది.. దేవుడి మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా. మీరు 10-12 సీట్లు ఇవ్వండి.. మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. తంగళ్లపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లు ఉంది.. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలిసో తెలియకనో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని కోరారు.
కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు, బోనస్ సంగతి పక్కన పెట్టిండు, తంగళపళ్లి బ్రిడ్జి కింద నీళ్లు లేకుండా చేసిన్రు. బీజేపోళ్లు డైరెక్ట్‌గా 400 సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఉండాలె. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది.. ఆయనను తంగళ్లపల్లి చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెసోళ్లే గుర్తుపట్టరు అని అన్నారు.
మన అవసరాలను కాదని గోదావరి నీళ్లను కర్ణాటక, తమిళనాడు మళ్లిస్తాడంట మోడీ. ఇలాంటి కుట్రలను ఎదుర్కొవటం బీజేపీ, కాంగ్రెస్ వాళ్లతోని అయ్యే పని కాదు. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది అని కేటీఆర్ విమర్శించారు.
ఇక పార్లమెంట్ స్థానాలకు ఒక్కటే జిల్లా ఉండాలని రేవంత్ రెడ్డి చెబుతుండు. జిల్లాలు రద్దు కాకుండా ఉండాలంటే దానికోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ లోక్‌సభలో ఉండాలె. మనకు మనకు ఎన్ని గొడవలున్నా సరే వాటిని పక్కన పెట్టండి. సిరిసిల్లలో పదేళ్లు ఆత్మహత్యలు అనే మాట వినబడలే.. మళ్లీ ఇప్పుడు నేతన్నల ఆత్మహత్యలు మొదలైనయ్ అని తెలిపారు.
కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది.. కరెంట్ లేదు.. ఆత్మహత్యలు మొదలైనయ్. మళ్లీ బీఆర్ఎస్ గెలవాలె.. తెలంగాణ పచ్చగా కళకళలాడాలె. ఉన్న నాలుగు రోజులు కష్టపడి ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయ్. కరీంనగర్‌లో మనకు కాంగ్రెస్‌తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉంది అని పేర్కొన్నారు.
మోడీ 2014లో ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు.. అదే ఏడాది బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్లలో ఏం పనులు చేసినవ్ అని అడిగితే సాయంత్రం దాకా లెక్క చెబుతా.. రైతులు, నేతన్నలు, వృద్ధులకు చేసిన మంచి పనులు..అభివృద్ధి పనులు ఎన్నో చేసినం అని చెబుతా.. మరి బీజేపోళ్లకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పు బండి సంజయ్ అని అడిగారు.
ఒక్క పైసా పని చేయకుండా మేము గుడి కట్టినం అంటారు.. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా.. కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు.. రిజర్వాయర్లు, చెరువులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసిండు. వాటికి కూడా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, కొండ పోచమ్మ సాగర్ అని దేవుళ్ల పేరు పెట్టిండు. మిడ్ మానేరులో సముద్రాన్ని తెచ్చినట్టు నీళ్లతో నింపిండు.. మరి దేవుళ్లకు ఇంత సేవ చేసిన కేసీఆర్‌కు ఓటు వేయాల్నా? వద్దా? అని ప్రశ్నించారు.
రైతుల ఆదాయం డబుల్, ప్రతి ఇంటికి నల్లా, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, బుల్లెట్ ట్రైన్, రూ. 15 లక్షలు అన్నాడు మోడీ.. ఒక్కటన్నా అయ్యిందా? అదే కేసీఆర్ సిరిసిల్ల, కరీంనగర్ పరిధిలో ఎన్నో పనులు చేసిండు.. మరి ఏమీ చేయని మోడీకి ఓటు వేద్దామా?చిన్న చిన్న కారణాలతో కేసీఆర్‌కు ఓటు వేయకుండా ఉందామా? అని అడిగారు.
మోడీ ఈ దేశానికి చేసిన అతి పెద్ద మోసం.. మొత్తం ధరలు పెంచటం.. మోడీ ప్రధాని అయినప్పటికి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధర 16 డాలర్లు తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ ధరలు ఎందుకు పెరిగినయ్ .. ప్రజల ముక్కు పిండి రాష్ట్రాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. 34 శాతం పన్ను అదనంగా వేసి మన దగ్గర నుంచి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు అని తెలిపారు.
ఏం చేసినవయ్యా ఆ పైసలు అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు.. మరి టోల్ ఎందుకు ఎందుకు వసూల్ చేసివంటే చెప్పడు. రూ. 30 లక్షల కోట్ల నుంచి అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు రూ. పద్నాలున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు. నేను చెప్పింది తప్పని బండి సంజయ్ నిరూపిస్తే నా రాజీనామా ఆయన చేతిలో పెడతా. కాకులను కొట్టి గద్దెలకు పెట్టిండు.. పేదోళ్ల కడుపు కొట్టి పెద్దళ్లకు పెట్టిండు.. తెలంగాణకు గుండుసున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటు వేయాలె అని ధ్వజమెత్తారు.
ఐదేళ్లలో సిరిసిల్లకు, తంగళపల్లికి ఒక్క పనినైనా బండి సంజయ్ చేసిండా? నేను చెప్పిన విషయాలను మీరంతా ప్రజలకు చేరవేయాలే.. ఎన్నో పనులు చేసిన కేసీఆర్ రుణం తీర్చుకోవటానికి మనకు ఈ ఎన్నికలు ఒక అవకాశం. పదేళ్ల నిజం.. పదేళ్ల విషానికి, 150 రోజుల అబద్ధానికి జరుగుతున్న పోరాటం ఇది.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే వాళ్లు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మేము లుచ్చా పనులు చేసినా ఒక్క పని చేయకపోయిన ప్రజలు మనకు ఓటు వేస్తారు అనుకుంటారు. లుచ్చా మాటలు చెప్పే రేవంత్ రెడ్డికి, గాలి తిరుగుడు తిరిగే బండి సంజయ్‌కి బుద్ధి చెబుదాం. చిన్న, చిన్న మనస్పర్థలు పక్కన పెట్టండి.. కష్టపడి పనిచేస్తే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది అని తెలిపారు.
మన అభ్యర్థి వినోద్ కుమార్ గారికి భారీ మెజార్టీ ఇద్దాం.. ఈ నెల 10 నాడు సిరిసిల్లకు కేసీఆర్ గారు వస్తున్నారు.. ఆ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు.