mt_logo

ఏసీబీ కస్టడీలో కీసర ఎమ్మార్వో!

రూ.1 కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ ఇటీవల పట్టుబడ్డ కీసర ఎమ్మార్వో నాగరాజును మంగళవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాగరాజుతో పాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజ్ ను కూడా మూడురోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు హైదారాబాద్ ఏసీబీ కోర్టు సోమవారం నాడు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులను అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మరింత లోతుగా విచారణ జరిపేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నట్లు తెలిసింది.

కీసర మండలంలోని సుమారు 19 ఎకరాల భూమిని తాసీల్దార్ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా మలిచే ప్రయత్నంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎమ్మార్వో నాగరాజు వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న రాంపల్లి పరిధిలో ఈ విలువైన భూమి ఉంది. దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుండగా అందులో ఉన్న లోపాలను అనుకూలంగా మలుచుకుని సదరు భూమిని స్థిరాస్తి వ్యాపారులకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు తాసీల్దార్ నాగరాజు అంగీకరించినట్లు తెలిసింది. దాదాపు రూ. 2 కోట్ల వరకు ఎమ్మార్వో, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య లావాదేవీలు జరిగినట్లు, మొదటి రోజు రూ. 1 కోటి పది లక్షలు చెల్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *