mt_logo

దళితబంధు ఆగడానికి కారణం బీజేపీనా..?

హుజురాబాద్ రాజకీయం రసకందాయంలో పడింది. సీఏం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు హుజురాబాద్ లో ఆగిపోయింది. ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రబావితం చేసేలా కేసీఆర్ ఈ పని చేస్తున్నాడంటూ కొందరు చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ పథకం అమలును నిలిపివేసింది. దాంతో హుజురాబాద్ ఒక్కసారిగా భగ్గుమంది. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఈసీకి పంపిన లేఖ కారణంగా ఈ పథకం ఆగిందా..? లేక ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో ఈ డామేజ్ జరిగిందా..? పరస్పర ఆరోపణలతో హుజురాబాద్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. దళితబంధు ఆగిపోపవడానికి సీఏం కేసీఆర్ కారణం అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్ తో దుమారం మరింత పెరిగింది కానీ ఇది వాదనకు నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే ‘టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది, దీనిద్వారా దళిత ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలనే వ్యూహంతో అమలు చేసిన పథకాన్ని ఈ సమయంలో కేసీఆర్ ఆపుతాడా..?’ అనేది సగటు ఓటర్ల మనసులో మాట. కాగా ఈ పథకం ఆగిపోవడం వెనుక కచ్చితంగా బీజేపీనే ఉందంటూ టీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి రాసిన లేఖ వల్లే దళిత బంధు ఆగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అరోపించగా, ఇది బీజేపీ ఉద్దేశ పూర్వక కుట్రగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని మరో ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా ఈ పథకంపై తాము భారత ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది వాస్తవమే అని, దళితబంధు స్కీమ్ బాగుంది కానీ ఇది సరైన సమయం కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పద్మనాభ రెడ్డి అన్నారు.

ఇక హుజూరాబాద్ లో అధికార పార్టీని ఇరుకున పెట్టి, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కుట్ర పన్నుతోంది కమల దళం. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టబోతోందనేది రాజకీయ విశ్లేషకుల మాట. నోటికాడ కూడు లాక్కున్న చందంగా బీజేపీ చేసిన ఈ పని వల్ల దళితుల్లో వచ్చే ఆగ్రహం బీజేపీకే చేటు చేస్తుందని చెబుతున్నారు. దెబ్బకు దళిత ఓటు బ్యాంకు గంపగుత్తగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఇప్పుడీ బంధును బందు పెట్టడం వల్ల హుజూరాబాద్ ఎన్నికల బరిలో గెయినరెవరు- లూజరెవరు? ఈసీకి లేఖ రాయడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి సమాధానం ఏంటి ? చివరి క్షణంలో బీజేపీ చేసిన ఈ పొరపాటుకు ఈటెల భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాడా..? చూద్దాం.. ఏం జరగనుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *