mt_logo

సిద్దిపేటను తీర్చిదిద్దుతా – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సిద్దిపేటకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు అక్కడి ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. రంగధాంపల్లి నుండి సిద్దిపేటకు ర్యాలీ నిర్వహించిన అనంతరం హరీష్ రావు అమరవీరుల స్థూపంవద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టమని, ఇక్కడే కళ్ళు తెరిచాను, ఇక్కడే కళ్ళు మూస్తాను. ఈ నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఉద్యమం ఎన్నోసార్లు ఒడిదుడుకులకు గురైనా మళ్ళీ గాడిలో పడేలా చేసిన ఘనత సిద్దిపేటదేనన్నారు. ఇంతటి అభిమానాన్ని చూపిన సిద్దిపేట ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేట గుర్తుకు వస్తాయనే విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన సిద్దిపేటను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హరీష్ అన్నారు. సిద్దిపేటలో నాటిన తెలంగాణ ఉద్యమమనే విత్తనం మహావృక్షమై మిగతా పదిజిల్లాల ప్రజలను కదిలించిందని, మిలియన్ మార్చ్, సాగరహారం, ఉద్యోగ గర్జన తదితర ఉద్యమాల్లో పాల్గొన్న ఘనత ఇక్కడి ప్రజలకే అని, సిద్దిపేట ప్రజలు పాల్గొనని ఉద్యమమే లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 50 వేలకుపైగా ప్రజలు 1500 రోజులకుపైగా దీక్షలు చేపట్టి తెలంగాణ సాధించుకున్నారని, కేసీఆర్ ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ వచ్చిందని, పునర్నిర్మాణంలో అందరూ కృషిచేసి బంగారు తెలంగాణ నిర్మించుకోవాలని సూచించారు. ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత నందినీ సిద్ధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో అమరులైన వారికి ఈ విజయం అంకితమని, పట్టు వీడని విక్రమార్కుడిలా కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ పట్టును విడవకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత హరీష్ రావుదే అన్నారు. హరీష్ ను చూడగానే తెలంగాణ గుర్తుకు వస్తుందని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *