దర్శకుడు ఎన్ శంకర్ నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సినిమా సిటీ ప్రకటనపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హాలీవుడ్ ను తలదన్నేలా సినిమా సిటీని నిర్మిస్తామని, సినీ రంగాన్ని అన్నివిధాలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. రెండువేల ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన సినిమా సిటీలో కేవలం సినిమాల నిర్మాణమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్ వంటి అన్ని సదుపాయాలనూ కల్పిస్తామని అన్నారు.
సినిమా సిటీపై చర్చించేందుకు త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, దానికి దక్షిణ భారత సినీరంగ పెద్దలు, తెలుగు సినీపరిశ్రమ ప్రతినిధులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొట్టారకర మాట్లాడుతూ, సీఎం చంద్రశేఖర్ రావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఆయన సినీ రంగాన్ని ఎంతగా ఆదరిస్తారో అర్థమైందని కీర్తించారు. ఎన్ శంకర్ మాట్లాడుతూ, సినిమా సిటీ ప్రకటన ఎంతో అద్భుతమైనదని, హాలీవుడ్ స్టూడియోలకు కస్టోరియం హెడ్ గా పనిచేస్తున్న ఉదయ్ సింగ్ వంటి వారి సూచనలతో నిర్మాణం చేపట్టాలన్నారు.
సీఎం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచంలోనే అతి పెద్ద సినీ హబ్ గా రాష్ట్రం మారుతుందని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ సీ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కు ఇండియన్ సినిమా సెంటినరీ లోగోను సభ్యులు బహూకరించారు. సీఎం ను కలిసిన వారిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు బీ శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.