-800 కోట్ల రూపాయలతో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించిన మార్స్ గ్రూప్ సంస్థ
తెలంగాణ రాష్ట్రానికి తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ తెలంగాణలో అదనంగా మరో ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈరోజు మంత్రి కె.తారక రామారావు తో మార్స్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ తన విస్తరణ ప్రణాళికలను, నూతన పెట్టుబడి గురించిన వివరాలను ప్రకటించింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్రంలో తమ పెట్టుబడి మరియు కార్యకలాపాల అనుభవాలను వివరించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే తమ సంస్థ సిద్దిపేట లో ఉన్న పెంపుడు జంతువుల (పెట్స్) ఫుడ్ తయారీ ప్లాంట్ ను ద్వారా పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. తొలుత కేవలం 200 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థ సిద్దిపేటలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మార్స్ సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని ఇందులో భాగంగా 500 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది.
ఒప్పందం మేరకు 500 కోట్ల రూపాయల పెట్టుబడిని పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల అనుభవాలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణం, ప్రభుత్వ విధానాల వంటి అనేక సానుకూల కారణాల వలన తాజాగా మరో 800 కోట్ల రూపాయల పెట్టుబడి విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. భారతదేశంలో తమ సంస్థ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తుందని పెట్ కేర్ మరియు పెట్ ఆహార ఉత్పత్తుల డిమాండ్ మరింత పెరుగుతుందన్న ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ కేంద్రంగా సంస్థలు మరింతగా విస్తరించనున్నట్లు తెలిపింది.
కేవలం ఉత్పత్తి తయారీ ప్లాంట్ విస్తరణ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రికల్చర్ సప్లై చైన్, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాల్లోనూ తమ విస్తరణకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ తో జరిగిన ఈ సమావేశంలో కృష్ణమూర్తి బృందం విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే సిద్దిపేటలో తయారీ ప్లాంట్ ఉన్న మార్స్ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టి మరింతగా విస్తరిస్తుండడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త కంపెనీల పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమైన అంశంగా భావిస్తామో, ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు కూడా తిరిగి తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్నది తమ ఆలోచనగా ఉన్నదని తెలిపారు .
ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక కంపెనీలు పెద్ద ఎత్తున తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుతున్నాయని తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఒక కంపెనీ తాను కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో తిరిగి పెట్టుబడులు పెట్టడం అంటే ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సూచిక అని తెలిపారు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి తమ సంస్థను విస్తరిస్తున్న మార్స్ గ్రూప్ సంస్థకు సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కేవలం 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ ప్రస్థానం నేటి ఎనిమిది వందల కోట్ల విస్తరణ ప్రణాళికలతో 1500 కోట్ల స్థాయికి చేరిందని, ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతను వివరిస్తుందన్నారు. భవిష్యత్తులోనూ సంస్థ మరింతగా తెలంగాణ కేంద్రంగా విస్తరిస్తున్నదన్న ఆశాభవాన్ని వ్యక్తం చేశారు