mt_logo

‘డబుల్ బెడ్ రూమ్’ పథకం ప్రధాని స్వరాష్ట్రంలో కూడా లేదు : మంత్రి కేటీఆర్

త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ నగర పరిధిలో కైతలాపూర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో ఉండే పేదలకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ల సెంటర్లు, ఇప్పుడు ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలు బాగు చేసుకుంటున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రాక ముందు ఈ రాష్ట్రంలో 29లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేదని, తెలంగాణ ఏర్పాటయ్యాక అవి 40 లక్షలకు పెరిగాయని అన్నారు. అపుడు రూ.200, రూ.500 వచ్చే పెన్షన్ రూ.2000 అయిందని తెలియజేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం.. ఆ నాడు ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.800 కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామని… మరో మూడు నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని, పేదవారి మొఖంలో చిరునవ్వు చూడడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో కొత్త రేషన్‌ కార్డుల జారీలో కొంత ఆలస్యమైంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లతో పాటు డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌, అధికారులతో సమావేశమై డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతామని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు అనే కార్యక్రమం లేదని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ లేదని తెలిపారు. హైదరాబాద్‌లో కట్టిన ఇండ్లు రూ.30 నుంచి రూ.50లక్షల విలువ ఉంటుందని, అలాంటి ఇండ్లు ఉచితంగా ఇచ్చే సమయంలో పారదర్శకంగా అర్హులకు మాత్రమే అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *