వ్యవసాయం, పారిశ్రామికం, ఐటీ, విద్యుత్తు.. ఇలా ఏ రంగం తీసుకొన్నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నది. సీఎం కేసీఆర్ విజన్‌తో రాష్ట్రంలోని మూలమూలకూ అభివృద్ధి జరుగుతున్నది. ఊరూరా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మిషన్ భగీరథ అనే పథకం ద్వారా వందశాతం ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్లిచ్చిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సాక్షాత్తు పార్లమెంట్‌లోనే కితాబిచ్చారు. అలాగే, సీఎం కేసీఆర్ మదిలోనుంచి పుట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో స్వచ్ఛతలోనూ తెలంగాణ దూసుకుపోతున్నది. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య కల తెలంగాణలో సాకారమైంది. దీనికి కేంద్ర సర్కారు ఇచ్చిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులే నిదర్శనం. కేంద్ర ప్రశంసలే కొలమానం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భ జలాల పెంపుపై ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి అధ్యయనం చేశారు. ఇక్కడి జలవనరుల పునరుద్ధరణ ఐఏఎస్, ఏపీఎస్‌లకు జలపాఠంగా మారింది. ఇలా.. ఢిల్లీ పెద్దలు.. ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకొంటున్నా స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఇదేదీ కానరావడం లేదు.
తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీ పెద్దలు, ఇతర రాష్ట్రాల నాయకులు ఫిదా.. బీజేపీ, కాంగ్రెస్ గల్లీ లీడర్లకు కానరాని డెవలప్‌మెంట్!..!
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఇందులో పాల్గొనేందుకు ఢిల్లీ పెద్దలతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్య నాయకులు హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి అభివృద్ధి చూసి వారు ఫిదా అయినట్టు తెలుస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ తెలంగాణ అభివృద్ధి మాడల్ చూసి ఆశ్చర్యపోయారు. నగరంలోని జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో ఆయన పర్యటించారు. అక్కడ చెత్తతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్న తీరుకు ముగ్ధుడయ్యారు. జీహెచ్ఎంసీ చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ గురించి అడిగి తెలుసుకొన్నారు. చిత్తశుద్ధితో చేస్తున్న చెత్త నిర్వహణను చూసి ముచ్చటపడ్డారు. తమ రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తామని తోటి నాయకులతో చర్చించినట్టు సమాచారం. ఇలా.. తెలంగాణకు ఎవరొచ్చినా ఇక్కడి అభివృద్ధి నమూనాకు ఫిదా అవుతుంటే.. బీజేపీ, కాంగ్రెస్ స్థానిక నాయకులు మాత్రం కేవలం ఓట్లకోసం అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.