mt_logo

దిగ్విజయుని అకాలజ్ఞత..

By: కట్టా శేఖర్‌రెడ్డి

మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకించే పార్టీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కొల్లగొట్టాలన్న ద్రోహబుద్ధిని ఎండగట్టని పార్టీలు తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తాయి? బీజేపీది కర్ణుడి పరిస్థితి. చంద్రబాబుతో కలిసి నడవడం వారి బలహీనత. చంద్రబాబుతో ఆ పార్టీని కలిసి చూసినంతకాలం తెలంగాణలో అనుకున్నంతగా ఆ పార్టీ ఎదగలేదు.

ఈ పరిమితులను అధిగమించనంతకాలం ఏ పార్టీ అయినా తెలంగాణలో పెను మార్పులు సృష్టించే అవకాశమే లేదు. ముందు చేయాల్సిన పని వెనుక, వెనుక చేయాల్సిన పని ముందు చేస్తే ఏమవుతుంది? చిప్ప చేతికొస్తుంది. ఎప్పుడు ఏది చేయాలో తెలియకపోవడం వల్లనే కాంగ్రెస్‌కు ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. ప్రాప్తకాలజ్ఞత లేకపోవడం ఎంత దరిద్రమో, గతజల సేతుబంధమూ నిరర్థకమే.

కాంగ్రెస్ ఇంకా అదే బాటలో పయనిస్తున్నది. తెలుగునేలపై కాంగ్రెస్‌ను తన మహాద్భుత వ్యూహాలతో పాతాళాన దించిన ఆ పార్టీ అగ్రనాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికీ అవే పాఠాలు బోధిస్తున్నారు. శిథిలమైన ఇంటిని పునర్నిర్మించుకునే పని చేయమని చెప్పడం లేదు. విరిగిన డాలూ కత్తులు తీసుకుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంపై, అక్కడ చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేయాలని ఉసిగొల్పుతున్నారు. విషాదం ఏమంటే కాంగ్రెస్ ఇంతవరకు ఆత్మవిమర్శ చేసుకున్నది లేదు. ఇంత ఘోర పరాజయం తర్వాత ఏ పార్టీ అయినా ముందుగా చేయాల్సింది ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడం. ఇంత కష్టపడి తెలంగాణ ఇచ్చినా తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించలేదో, మంత్రి పదవులు ఇచ్చి, ప్రాజెక్టులు ఇచ్చి, అప్పులు మాఫీచేసి అంత బుజ్జగించినా ఆంధ్రా నాయకత్వం ఎందుకు నిలబడలేదో కాంగ్రెస్ ఇంతవరకు గుర్తించనే లేదు. తప్పులు తెలుసుకుని, ఒప్పుకుని, చెంపలు వేసుకుని జనం ముందుకు వెళితేనే ఏ నాయకుడినయినా మళ్లీ జనం గుర్తించేది.

అప్పుడు మొదలు పెట్టాలి మళ్లీ రాజకీయ పోరాటం. కానీ కాంగ్రెస్ ఇంతవరకు ఆ దిశగా ప్రజలకు ఎటువంటి సందేశమూ ఇవ్వలేదు. చింతన్ బైఠకులు పెట్టుకున్నారు కానీ వాటి సారాంశం ఏమిటో ప్రజలకు చేరనేలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తాము చేసిన తప్పులను గుర్తించలేదు. ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ సారథ్యంలో ఏం జరిగిందో ఆయనా చెప్పలేదు, పార్టీ చెప్పలేదు. తెలంగాణ ప్రజలు మాత్రం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యవహ రించిన తీరును శిక్షించారు. మూడు నాలుగేళ్లపాటు తాము అనుభవించిన విపరీత మానసిక క్షోభకు ప్రతీకారం తీర్చుకున్నారు. అయినా దిగ్విజయ్ సింగ్‌ను తెలంగాణ, ఆంధ్ర బాధ్యతల నుంచి తప్పించలేదు.

రాష్ట్ర విభజన అనివార్యమైన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవినుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డారు. ఢిల్లీ వెళ్లారు. సోనియాగాంధీని కలిసి అదే మాట చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సోనియాగాంధీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా బొత్సా సత్యనారాయణను పిలిపించమని దిగ్విజయ్‌కి కబురు పెట్టారు. మరుసటిరోజు ఉదయమే బొత్సా ఢిల్లీకి వెళ్లారు కూడా. కానీ తెల్లారేసరికి సీను మారిపోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారట. దిగ్విజయ్‌సింగ్ మేడమ్‌ను ఒప్పించారట. తర్వాత జరిగిన కథ షరా మామూలే. కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత ఓ పక్షం రోజుల నుంచి సీఏం పేషీ కేంద్రంగా తెలంగాణకు వ్యతిరేకంగా చెలరేగిపోయారు. పరమ దుర్మార్గమైన వాదనలన్నీ గుప్పిస్తూ వచ్చారు. ఉన్నవీ లేనివీ, జ్ఞానమూ, అజ్ఞానమూ అన్నీ కలగలిపి గంటలు గంటలు వలపోస్తూ వచ్చారు. రాష్ట్రం ఇస్తూ ఇస్తూ తెలంగాణ హృద యాలను ఛిద్రం చేస్తూ వచ్చారు.

తెలంగాణ ప్రజల గుండెలు మండిపోతూ వచ్చాయి. పిల్లల ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి. ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు బుద్ధావతారాల్లా సంచులు మోసుకుంటూ తిరిగారు. పల్లెత్తి ఒక్క మాటా అనలేకపోయారు. కాంగ్రెస్ ఎంపీలు కొందరు పోరాడుతూ వచ్చినా, జనంతో నేరుగా సంబంధాలుండే వాళ్లు, ప్రభుత్వంలో కిరణ్ పక్కన కూర్చునే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోయేసరికి సహజంగానే జనానికి మండిపో యింది. వీళ్లేం మనుషులు? వీళ్లేం నాయకులు? వీళ్లేం మంత్రులు? అని జనం బాహాటంగానే తిట్టిపోస్తూ వచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మొదటి పత్రికా సమావేశం పెట్టిన రోజే తెలంగాణ మంత్రులు ఆయనను సవాలు చేసి ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి.

నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. నువ్వు ఆంధ్రా నాయకునివి మాత్రమే అని తిరగబడి ఉంటే తెలంగాణలో ఆ పార్టీకి ఇన్ని నూకలు దక్కి ఉండేవి. ఈ మొత్తం పరిణామంలో కిరణ్‌ను కొనసాగించడం అన్నది కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన పెద్ద తప్పు. ఆయనను కొనసాగించడానికి కారణమైన వారెవరో బయటపడలేదు. ఎందుకు కొనసాగించాల్సివచ్చిందో చెప్పుకోలేదు. కొనసాగించినవారు ఆయనకు ఎందుకు ముకుతాడు వేయలేకపోయారో వివరణ ఇచ్చుకోలేదు. అసలు తెరవెనుక ఏమి గూడుపుఠానీ జరిగిందో బయటికి రాలేదు. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే? ఆయన మొండోడు. ఓడిపోయినా పోరాడి ఓడిపోయేవాడు. ఆంధ్ర కాంగ్రెస్ చరిత్రలో కిరణ్ ఒక బ్రూటస్. ఇవ్వాళ తెలంగాణలో, ఆంధ్రలో కాంగ్రెస్‌ను విజయవంతంగా సర్వనాశనం చేసిన ఘనత కిరణ్‌దే. ఒక రకంగా టీఆర్ఎస్, టీడీపీలు ఆయనకు రుణపడి ఉండాలి.

ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపార్టీలో ఉన్నారో తెలియదు. ఏ పార్టీలో చేరతారో తెలియదు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినవారు, చెప్పగలిగినవారు దిగ్విజయ్ సింగే. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోకుండా ఆయన ఏం మాట్లాడినా దండగే. ఎంతమంది మేధావుల సలహాలు తీసుకున్నా వృథా ప్రయాసే. ఆయన సంప్రదించిన మేధావులెవరూ కాంగ్రెస్ మేలు కోరేవారు కాదు. అసలు వాళ్ళు ఎవరి మేలూ కోరే అవకాశం లేదు. వారిలో చాలా మంది ఆశోపహతులు. తెలంగాణ సాధనలో చెప్పుకోవడానికి తమకు ఏమీ మిగలలేదే అని బాధపడుతున్నవారు. వారు సహజంగానే ప్రతిపక్షాలన్నీ ఉన్న పళాన తెలంగాణ ప్రభుత్వంపై ఒంటికాలుపై ఉరకాలని ఆశిస్తారు. ఇది సమయం, సందర్భం కాదన్న విచక్షణ లోపించినవాళ్లు. కేవలం అక్కసుతో మండిపోతున్నవాళ్లు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని చెప్పరు. చెదరిపోయిన పార్టీ శ్రేణుల్లో ముందుగా ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పరు. పార్టీని తిరిగి అట్టడుగు నుంచి నిర్మించుకుంటూ రావాలని చెప్పరు. సమయోచితంగా స్పందించాలని చెప్పరు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది మాసాలు. విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడిప్పుడే అధికారులు వచ్చి చేరుతున్నారు. సిబ్బంది విభజన ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఈ కొద్దికాలంలోనే చేయగలిగిన మంచినంతా చేస్తున్నది. కాంగ్రెస్ రెండు రాష్ట్రాలను ఏలింది ముప్ఫై ఆరేళ్లు. టీడీపీ ఏలింది పదిహేడేళ్లు. పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ వంటివారు చాలాకాలం మంత్రి పదవుల్లో, కీలక శాఖల్లో ఉన్నవారు.

వారు ఏం చేశారో, ఏం చేయలేదో జనం చూశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించి ఎంతో కాలం కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డిలలో తప్ప టీడీపీని తెలంగాణ అంతటా ఛీకొట్టారు. అక్కడో ఇక్కడో పొల్లుబోయి గెలిచినవారికైనా సోయి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతయినా స్వతంత్రంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్న సద్బుద్ధి కలుగలేదు. అటు పొన్నాల నుంచి ఇటు రేవంత్ దాకా వెకిలి వేషాలు, వెకిలి మాటలు. కొత్త రాష్ట్రం సాధించుకున్నాం. కొత్తగా రాజకీయ నిర్మాణం చేసుకుందాం. స్వతంత్రంగా, నిర్మాణాత్మకంగా, హుందాగా వ్యవహరిద్దాం అన్న తెలివి లేకుండా పోయింది. ఏదో దుగ్ధతోనో, ఎవడో కీ ఇస్తేనో మాట్లాడడం కాకుండా సొంత సోయితో తిరిగి ఎదుగుదాం అన్న స్పృహ లేకుండా పోయింది.

తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ సాధన సందర్భంగా జరిగిన తప్పులకు, వైఫల్యాలకు తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకుని తీరాలి. కాంగ్రెస్ తెలంగాణలో లోకస్‌స్టాండీ ఉన్న పార్టీ. ప్రజలను సమాధానపరిస్తే ఎప్పటికయినా ఎదిగే అవకాశం ఉంది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు ఆంధ్రా పార్టీలుగా అవి స్థానికతను, సంబద్ధతను రెండూ కోల్పోయాయి.

ఆంధ్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే పార్టీలుగా అవి రోజురోజుకూ తమను తాము మల్చుకుంటున్నాయి. ఆంధ్రాలో మనుగడ సాగించడానికి చంద్రబాబుకు, జగన్‌మోహన్‌రెడ్డికి అంతకంటే మార్గం లేదు. తెలంగాణతో కయ్యాన్ని సజీవంగా ఉంచడం చంద్రబాబు అవసరం. అందుకే నేరని నల్లిలాగా ఆయన ఎక్కడెక్కడ మెలికలు పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ వస్తున్నారు. మాపై రాజకీయ ఒత్తిడి ఉంది. ఇది తప్పని తెలిసినా, కోర్టుల్లో సమస్యలు వస్తాయని అనుభవం ఉన్నా కొన్ని (తెలంగాణకు) అప్రియ నిర్ణయాలు చేయాల్సి వస్తున్నది ఒక సీనియర్ ఆంధ్రా అధికారి అంతర్గత సంభాషణల్లో చెప్పారు. చంద్రబాబు శైలి అది.

చంద్రబాబుకు ఉన్న అనివార్యత కూడా. అటువంటి నేత నీడలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వంపైకి ఎన్ని బాణాలు వేస్తే మాత్రం ఏమవుతుంది? చాలా చిన్న లాజిక్ ఇది. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకించే పార్టీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కొల్లగొట్టాలన్న ద్రోహబుద్ధిని ఎండగట్టని పార్టీలు తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తాయి? బీజేపీది కర్ణుడి పరిస్థితి. చంద్రబాబుతో కలిసి నడవడం వారి బలహీనత. చంద్రబాబుతో ఆ పార్టీని కలిసి చూసినంతకాలం తెలంగాణలో అనుకున్నంతగా ఆ పార్టీ ఎదగలేదు. ఈ పరిమితులను అధిగమించనంతకాలం ఏ పార్టీ అయినా తెలంగాణలో పెను మార్పులు సృష్టించే అవకాశమే లేదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *