mt_logo

ఎరువుల ధరల పెంపుపై ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్న సీఎం కేసీఆర్

కేంద్రప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల సీఎం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం యొక్క నడ్డి విరిచిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం, ఎన్ఆర్జీఈని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం, వెనక కుట్ర దాగి వుందన్నారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీ ని కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కెసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *