చైనాలో బిజీగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్ నుండి బయలుదేరివెళ్లి షెన్‌జాన్ నగరానికి చేరుకుంది. ప్రపంచ ఆర్ధికసదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి డాలియన్, బీజింగ్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్) తెలుసుకున్న చైనాలోని పలు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.
ఇదిలాఉండగా షెన్‌జాన్ చేరుకోకముందు సీఎం బృందం బీజింగ్ లోని పర్యాటక ప్రాధాన్యం కలిగిన తియానన్మెన్ స్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించింది. చారిత్రక కట్టడాలైన వాటి నేపథ్యం, పర్యాటక రంగాన్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.