ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ 9,10 సంస్థల ఉద్యోగుల విభజనపై చర్చించామని, రాష్ట్రానికి అఖిల భారత సర్వీస్ ఉద్యోగులను పెంచాలని కోరామని చెప్పారు. అంతేకాకుండా హైకోర్టు విభజన త్వరగా పూర్తి చేయాలని కోరామని, దీనిపై హోంమంత్రి స్పందిస్తూ హైకోర్టు సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారని వినోద్ పేర్కొన్నారు.
పలు అంశాల పరిష్కారం కోరుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోపు సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు, కేంద్ర హోంశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి ఖర్చు అయిన నిధులు కూడా కేటాయించాలని కోరినట్లు వినోద్ తెలిపారు. ఇదిలాఉండగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై డిసెంబర్ లో నిర్వహించే చండీయాగానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.