రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటదో సీఎం కేసీఆర్ ప్రజలను ఆలోచన చేయాలన్నారు. ‘ఖానాపూర్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. 1956 వరకు హైదరాబాద్ స్టేట్ పేరుతో మన రాష్ట్రం మనకే ఉండె. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో సిటీ కాలేజీ దగ్గర 7గురు విద్యార్థులను కాల్చేసి, బలవంతంగా ఆంధ్రాలో కలిపింది.ఆనాడు కాంగ్రెస్ నాయకులు ముద్ద పప్పుల్లాగా కూర్చున్నరు గానీ ఏం మాట్లాడలేదని తెలిపారు.కాంగ్రెస్ చేసిన తప్పిదానికి యావత్ తెలంగాణ ప్రజలు కరువుల పాలై 58 ఏండ్లపాటు అరిగోస పడ్డారని బాధ వ్యక్తం చేసారు.
7500 మందికి 22,470 ఎకరాలను పోడు పట్టాల పంపిణీ
బీఆర్ఎస్ ప్రభుత్వం ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 7500 మందికి 22,470 ఎకరాలను పోడు పట్టాలు పంపిణీ చేసింది. మీ అందరికీ తెలిసిన విషయమే అన్నారు. కేవలం పోడు పట్టాలిచ్చి చేతులు దులుపుకోలేదు. గతంలో ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు. రైతుబంధు ఇచ్చి, రైతు బీమా కూడా పెట్టాం. 3 ఫేజ్ కనెక్షన్ కూడా ఇస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థి కావాల్నా? లేక ‘రైతుబంధు’ కావాల్నా?
కాంగ్రెస్ నాయకులు చాలా డేంజర్‌గా మాట్లాడుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘రైతు బంధు’ వేస్ట్ అంటున్నడు. ప్రజలేమో ‘రైతుబంధు’ ఉండాలని గట్టిగా కోరుతున్నరని తెలియజేసారు. ‘రైతు బంధు’ ఉండాలంటే ఖానాపూర్‌లో శ్యాం నాయక్ గెలువాలని సూచించారు. రైతుబంధు వేస్ట్ అనే కాంగ్రెస్ అభ్యర్థి కావాల్నా? లేక ‘రైతుబంధు’ కావాల్నో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కావాల్నా?. మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘ధరణి’ తీసేసి ‘భూమాత’ పెడుతరట.. అది ‘భూమాత’నా? లేక భూ‘మేత’నా? అని ప్రశ్నించారు.
రైతు చిప్ప పట్టుకొని తిరుగాలె
యాభై ఏండ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని మేం పదేండ్లల్లో పోగొట్టినం. రైతు బంధు కౌలుదారుల కాలమ్ పెట్టి, ఒకవేళ కౌలుదారే దున్నితే రైతుకు పైసలు ఇవ్వరట.. అది టీవీలల్లో కూర్చొని చెబుతున్నరు కాంగ్రెసోళ్లు. రైతుకియ్యం..కౌలుదారులకే ఇస్తమంటున్నరు కాంగ్రెసోళ్లు.. మనకున్న భూమి గోవింద మంగళం అయితదని హెచ్చరించారు. మూడేండ్లు కౌలుదారులకు వచ్చిందంటే..మన భూమి వాళ్ళ పాలైతది. మనం చిప్ప పట్టుకొని తిరుగాలె అని హెచ్చరించారు. ‘ధరణి’ తీసేస్తే వచ్చే బాధలు ఏంటి? కలిగే కష్టాలు ఏంటో ప్రజలు, రైతులు ఆలోచన చేయాలె. వాళ్లు బాజాప్తాగా ఖుల్లం ఖుల్లా చెబుతున్నారు. ఏం దాస్తలేరని అన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాటగలుస్తది.. ధరణికి దండం
కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదు గానీ.. పొరపాటున గెలిస్తే.. కరెంటు కాటగలుస్తది.. ధరణికి దండం పెడుతరు. సేమ్ పాత పైరవీకారుల కాలం వస్తది. మనం దెబ్బతింటాం. నాడు నిజాం సదర్ మాట్ కట్టిండ్రు. ఆనాడు దానిని బ్యారేజిగా కట్టలేదు. మామూలుగా కట్టిండ్రు. సదర్ మాట్ పైన బ్యారేజి కట్టినాం. పాత 15 వేల ఎకరాలు కాకుండా మరో 20 వేల ఎకరాలకు నీళ్లు వచ్చేలా చేసే బాధ్యత నాదన్నారు. గల్ఫ్‌కు వెళ్లేవారి బాధలను తీర్చేందుకు ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తుందని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ‘కారు గుర్తు’కు ఓటేసి, బీఆర్ఎస్ ను బలపర్చాలని సీఎం కేసీఆర్ మనవి చేసారు.