గురువారం భోపాల్ లో జరిగిన నీతి ఆయోగ్ ఉపసంఘం మూడవ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అరుణాచల్ ప్రదేశ్ సీఎం నాగం టుకీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాలలో అమలుచేస్తున్న కేంద్ర పథకాలలో కేంద్రం వాటా 80 శాతానికి తగ్గకుండా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులలో కోత వేయడం తగదని, ఈ కోతల వల్ల ఆర్ధికంగా మిగులు ఉన్న రాష్ట్రాలపై భారం పెరిగిపోతుందని అన్నారు.
సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయంతో సభకు హాజరైన మిగతా సభ్యులు ఏకీభవించారు. కేంద్రం నుండి వచ్చే నిధులు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగించాలని నాగాలాండ్ సీఎం జెలియాంగ్ కోరారు. కేరళ సీఎం ఊమెన్ చాందీ మాట్లాడుతూ రాష్ట్రాల రుణ సామర్ధ్యాన్ని పెంచాలని, కొత్త నిధుల మంజూరు విధానం వల్ల రాష్ట్రాలు నష్టపోరాదని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ ను మరో రెండేళ్ళు కొనసాగించాలని, సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మే, నవంబర్ నెలల్లో రెండు విడతలుగా ఇవ్వాలని అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబం టుకీ కోరారు. అంతేకాకుండా యూపీఏ హయాంలో ప్రారంభించిన 147 కేంద్ర పథకాలను 66కు తగ్గించాలని ఉపసంఘం సిఫారసు చేసింది. జూన్ 13న ఉపసంఘం ఆఖరి సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. జూన్ 20 న ఉపసంఘంలో తీర్మానించిన పది సిఫార్సులను ప్రధాని మోడీకి అందజేస్తామని ఉపసంఘ కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.