mt_logo

తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే కక్షతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలంగాణ చేసిన విన్నపాలను పక్కన పడేసింది. వరల్డ్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా పేరున్న హైదరాబాద్‌లో కాదని, మరోసారి గుజరాత్‌ మీద వరాలు కురిపించింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కావాలని తెలంగాణతోపాటు తమిళనాడు సైతం కోరగా రెండు రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వం… గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు బల్క్‌డ్రగ్‌ పార్కులను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ… దేశానికే రోల్‌మోడల్‌గా మారింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు సైతం హైదరాబాద్‌ కు క్యూ కట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఫార్మా రంగాన్ని మరింత విస్తరించాలని హైదరాబాద్‌ ఫార్మాసిటీలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం రెండువేల ఎకరాలు కూడా కేటాయించింది. తమకు అవకాశం కల్పించాలని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసింది. అయినప్పటికీ కేంద్రం తెలంగాణ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. వరల్డ్‌ వ్యాక్సిన్‌ కాపిటల్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌పై కేంద్రం కావాలని వివక్ష ప్రదర్శిస్తోందని తేటతెల్లమయింది. ఇది మాత్రమే కాదు, తెలంగాణలో పవర్‌ లూం టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ ఏర్పాటు మొదలుకొని పసుపు బోర్డు వరకూ, ఏదీ ఇవ్వకుండా కేంద్రం వివక్షను చూపుతున్నది. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని ఎనిమిదేండ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే ఇవ్వకుండా కర్ణాటక అప్పర్‌ భద్రకే ఇచ్చింది. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ అడిగితే ఇవ్వకుండా, రూ.20 వేల కోట్లతో గుజరాత్‌ కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేసింది.

అయితే ఆంధ్రప్రదేశ్‌కు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కేటాయిస్తూ కేంద్రం ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాకినాడలో పార్క్‌ ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులు, రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ శాసనసభా పక్షనేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. అక్కడ వేల మంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల్లో సాగుభూమి బీడు భూమిగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఫార్మా స్యూటికల్స్‌ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గతంలోనూ ఆ ప్రాంత ప్రజలు నిరసనలు తెలిపారు. అంతలా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆంధ్రాకి పార్క్‌ ఇస్తూ.. మరోవైపు అన్ని విధాలా కావాలని కోరుతున్న తెలంగాణపై వివక్ష చూపడం కేంద్రం తీరుకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *