mt_logo

తెలంగాణలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1500 చదరపు అడుగుల విస్తీర్ణం, ఆరు అంతస్థులు, రూ. 26 కోట్లతో 28 అడుగుల అంబేద్కర్ విగ్రహం తదితర ప్రత్యేక ఆకర్షణలతో హైదరాబాద్ నడిబొడ్డున టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టింది. దళితులకు విజ్ఞాన మార్గదర్శిగా నిలవనున్న ఈ భవనాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వ తేదీన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో దళితుల జీవన స్థితిగతులు, ఆరోగ్యం, విద్య, అసమానతలు, ఆర్ధిక స్థితి లాంటి అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేసి సామాజిక చైతన్యం తీసుకురావడమే సీడీఎస్ ముఖ్య ఉద్దేశం.

రూ.26 కోట్లతో హైదరాబాద్ నడిబొడ్డున చేపడుతున్న ఈ భవన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 28 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరింది. ఒడిశాలోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నుండి తెచ్చిన ఫాబ్రికేటెడ్ ఉక్కు దిమ్మెలను ఈ భవనం కోసం వాడారు. సీడీఎస్(సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్) లో పోటీ పరీక్షల కోసం వచ్చే వారికోసం యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒకేసారి 120 మందికి శిక్షణ ఇచ్చేందుకు వీలు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ భోజన, వసతి సౌకర్యం కూడా ఉంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు తెలంగాణతో పాటు, దేశవ్యాప్తంగా దళితుల ప్రస్తుత జీవన స్థితిగతులు, బడ్జెట్ కేటాయింపులు, ఎస్సీలపై జరుగుతున్న దాడులు తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇందులో ప్రత్యేక సభ్యులు ఉంటారు.

ఇదిలాఉండగా ఈ భవనం మొదటి అంతస్తులో కాఫీ బార్, డైనింగ్, వెయిటింగ్ లాంజ్, అతిధి ప్రసంగాల గదులు ఉంటాయి. రెండవ అంతస్తులో సెమినార్ హాల్, వీఐపీ లాంజ్, బోర్డు సమావేశాల రూమ్, యోగా హాల్, డైరెక్టర్ రూమ్, ఎగ్జిక్యూటివ్ రూమ్, తరగతి గదులు, వర్క్ స్టేషన్ ఉంటాయి. మూడవ అంతస్తులో లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, ఛైర్మన్ రూమ్, మీడియా రూమ్ ఉంటాయి. నాలుగో అంతస్తులో శిక్షణ కోసం వచ్చిన వారి వసతి కోసం 13 షేరింగ్ రూములు ఉంటాయి. ఐదో అంతస్తులో మూడు వందలమందికి పైగా కూర్చునేలా సమావేశ మందిరాలు ఉంటాయి. ఆరో అంతస్తులో దళిత మ్యూజియం(అంబేద్కర్, బుద్దుడుకు సంబంధించినవి)ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *