-ఉద్యమద్రోహులపై కసి తీర్చుకునే అవకాశం వచ్చింది.. వారిని చేతులతోకాదు.. ఓట్లతో కొట్టండి: మంత్రి ఈటెల
-తెలంగాణ దోహులకు ఉప ఎన్నికలు ఓ గుణపాఠం కావాలి: మంత్రి హరీశ్‌రావు
– టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించికేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలి: ఎంపీ కేకే
-ఉద్యమద్రోహులపై కసి తీర్చుకునే అవకాశం వచ్చింది.. వారిని ఓట్లతో కొట్టండి: ఈటెల
– బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ప్రజాగ్రహం తప్పదు: హరీశ్‌రావు
– కేసీఆర్ ప్రతి నిర్ణయమూ నిర్మాణాత్మకమే: పోచారం
– సిద్దిపేట, దుబ్బాకలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాలు
మెదక్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి.. కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలని టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. జగ్గారెడ్డిలాంటి ఉద్యమ ద్రోహులను చేతులతో కాదు, ఓటుతో దెబ్బకొట్టే అవకాశం మరోసారి మెదక్ ప్రజలకు వచ్చిందని, తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో దిమ్మతిరిగే గుణపాఠం చెప్పాలని పేర్కొంది.
ఆదివారం సిద్దిపేట, దుబ్బాకలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాల్లో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి భారీ నీటిపారుదల, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లాడుతూ అప్పుడే పురుడు పోసుకున్న ఓ రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా.. ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ, మరో రాష్ట్రంతో చేతులు కలిపి కేంద్రం కుట్రలు పన్నుతున్న తీరు అత్యంత ప్రమాదకర సంకేతాలనిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఇటు చంద్రబాబునాయుడు, అటు వెంకయ్యనాయుడు ద్వయం ఆడుతున్న కుట్రల నాటకంలో కేంద్రం పావుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం నుంచి హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనం అప్పగించడం వరకు ఈ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణలో వారి స్థాయి ఎంతగా దిగజారిందో మెదక్ ఉపఎన్నికలతో తేలిపోవాలని, అధికార బీజేపీ సహా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి.. మన ఆగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించాలని కేశవరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణా ఇవ్వలేదు. మనమే కొట్లాడి తెచ్చుకున్నం. దీనికి నేనే సాక్ష్యం. స్వయంగా సోనియా గాంధీయే తెలంగాణా ఇచ్చేది లేదని చెప్పింది అని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సిద్దిపేటలో లక్ష ఓట్ల మెజారిటీని కట్టబెట్టాలని, టీఆర్‌ఎస్ ఆభ్యర్థికి మీరిచ్చే మెజారిటీయే మాకు కొండంత బలాన్ని ఇస్తుందని, ఆ బలంతోనే కేంద్రంతో తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతామన్నారు. సిద్దిపేట అభివృద్ధికి మంజూరైన రూ.110 కోట్లను విడుదల చేయొద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన జగ్గారెడ్డిలాంటి నీచుడిని నేనింతవరకు చూడలేదన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుపై ఎలాంటి సందేహం లేదని, గత ఎన్నికల్లో వచ్చినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పదవుల కోసం ఆంధ్రా పాలకుల పాదాలకు మోకరిల్లి.. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలకు సూటిపోటి మాటలతో కించపరుస్తున్న జగ్గారెడ్డిలాంటి వ్యక్తులపై కసి తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని మెదక్ పార్లమెంటు ఉపఎన్నికల సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జగ్గారెడ్డి లాంటి ఉద్యమ ద్రోహులను చేతులతో కాదు, ఓటుతో కొట్టే అవకాశం వస్తుందని నేను, హరీశ్‌రావు ఎన్నోసార్లు అనుకున్నామని, ఆ అవకాశం మరోసారి మెదక్ జిల్లా ప్రజలకు వచ్చిందన్నారు. పదవుల కోసం ఉద్యమాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన పార్టీల అభ్యర్థులు ఇక్కడ ఎట్ల గెలుస్తరు..? వారికి ఓట్లడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమంలో కలిసి రాకున్నా సరే, కనీసం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై మాతో గొంతు కలపండని ప్రాధేయపడినా ముందుకురాని సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఎప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు. కరెంటు సమస్యలపై కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమిస్తామని, 2015 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించి రాష్ట్రంలోని ప్రతి పల్లెకు నిరంతర కరెంటుసరఫరా అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఇది 2015 నుంచి ప్రారంభం కానుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలను నామరూపాలు లేకుండా చేయాలి
అవిశ్రాంత పోరాటంతో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక ఒక బహుమానం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీలను నామరూపాలు లేకుండా చేసి, భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనాలన్న ఊసెత్తకుండా గుణపాఠం చెప్పాలని ఉద్బోధించారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఎంతో ధైర్యం, దానికి సంబంధించిన లోతైన పరిజ్ఞానం, నిర్ణయాన్ని అమలు చేసే దిశగా ఆయన చూపిస్తున్న సాహసం తన 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ముఖ్యమంత్రి వద్ద చూడలేదన్నారు.
విశ్రాంతి ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో సిద్దిపేట ఎప్పుడూ ఒక ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సిద్దిపేట ప్రాంతానికి చెందిన కేసీఆర్, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. మెదక్ పార్లమెంటు టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఆదరించి గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, సహచర ఎంపీల సహకారంతో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సతీష్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్, గొంగిడి సునీత, ఆళ్ళ వేంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీం, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, మైనంపల్లి హన్మంతరావు, టీఆర్‌ఎస్ నాయకులు నరేంద్రనాథ్, నవాబ్‌సహబ్, తుపాకుల బాలరంగం, రాజనర్సు, రాధాకిషన్‌శర్మ, నయ్యర్‌పటేల్ మాట్లాడారు. కార్యక్రమంలో పూజల వెంకటేశ్వర్‌రావు, జాప శ్రీకాంత్‌రెడ్డి, స్వామిచరణ్, ఖాత రామచంద్రారెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, చిప్ప ప్రభాకర్, వేణు, రాగుల సారయ్య, వెంకట్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, మోహన్‌లాల్, దువ్వల మల్లయ్య పాల్గొన్నారు.
ఆ పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలి: మంత్రి హరీశ్‌రావు
కేంద్రప్రభుత్వం తెలంగాణపై అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి, రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నాయుడు ద్వయం మాటలు వింటూ తెలంగాణపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలు దిమ్మతిరిగే గుణపాఠం చెప్పాలి. ఇందుకు మెదక్ పార్లమెంటు ఉపఎన్నికలే ఓ వేదిక కావాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీలో అద్వానీలాంటి ఉక్కు మనుషులు పోయి.. జగ్గారెడ్డిలాంటి తుక్కు మనుషులు వస్తున్నారని విమర్శించారు. పచ్చి సమైక్యవాది అయినా జగ్గారెడ్డికి టిక్కెట్టు ఇవ్వడం ద్వారా బీజేపీ ఎలాంటి సంకేతాలనిస్తున్నదని ఆయన ప్రశ్నించారు.
అసలు తెలంగాణపై మీ విధానమేంది? మీది సమైక్యవాదమా..? లేక తెలంగాణ వాదమా..? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ఋణమాఫీపై సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారని, మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులకు రూ.19వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీవో విడుదల చేయడం జరిగిందని, రుణాలపై బ్యాంకర్లను పూర్తి వివరాలకు ఆదేశించడం జరిగిందన్నారు. రుణమాఫీపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు.. ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని సూచించారు. ఇన్నాళ్లు పాలించిన వలస పాలకులు ఆంధ్రాలో పంట నష్టం జరిగితే వెంటనే నష్టపరిహారం చెల్లించేవారని, అదే తెలంగాణలో నయాపైసా విడుదల చేసిన పాపాన పోలేదని విమర్శించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాళ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.480 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీల బిడ్డల వివాహాలకు రూ.51 వేల ఆర్థిక సహాయ పథకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవుల్లో రిజర్వేషన్ల వంటి వినూత్న పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. గత ప్రభుత్వంలో కాబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా కొనసాగిన జగ్గారెడ్డి, మంత్రిగా కొనసాగిన సునీతాలకా్ష్మరెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఒక్కసారైనా మాట్లాడారా..? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సంగారెడ్డిని బీదర్‌లో కలుపాలని లేదా హైదరాబాద్‌లో కలపాలని.. మెదక్ జిల్లాతో నాకు సంబంధం లేదని అవాకులు చెవాకులు పేలిన జగ్గారెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మెదక్ జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటకు ఉప ఎన్నికలు కొత్తకాదని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఉద్యమ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇచ్చి ఉద్యమాన్ని నిలబెట్టిన గడ్డ అని కొనియాడారు. ఇప్పుడు కూడా కొత్త ప్రభాకర్‌రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వడం ద్వారా సిద్దిపేట ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..