mt_logo

బాబు అండ్‌కోది గోబెల్స్ ప్రచారం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పోటీపడలేక చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారానికి దిగాడని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరూపించడానికి ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

-కరెంటు రాకుండా అడ్డుపడుతున్నది బాబే
-టీడీపీ జెండా పట్టుకున్నోడు తెలంగాణ ద్రోహే
-ఎక్కడ చర్చించడానికైనా మేం రెడీ
-రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్, టీడీపీలే
-ప్రాజెక్టులు తేలేదు, చెరువులు నాశనం చేశారు
-భరోసాయాత్ర కాదు..జైలు యాత్ర చేయాలి
-మీడియాతో మంత్రులు రాజయ్య, జగదీశ్‌రెడ్డి చర్చకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు రావడానికి సిద్ధమని, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కైనా వస్తామని ప్రకటించారు. పీపీఏలను రద్దు చేసి తెలంగాణకు కరెంటు కష్టాలు తెచ్చింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. కేవలం 700 మెగావాట్ల విద్యుత్ కొని చంద్రబాబు ఏదో బ్రహ్మాండం బద్దలు చేసినట్టు ప్రచారం చేసుకున్నాడని, తాము 11వందల మెగావాట్లు కొని రైతులకు ఇస్తున్నామని గుర్తు చేశారు. మరో నాయుడితో కలిసి తెలంగాణకు చెందిన సీలేరును కూడా చంద్రబాబు కాజేశారని ఆరోపించారు. చంద్రబాబు ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్న విధంగా మాట్లాడతున్నాడని అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ జెండా పట్టుకుంటే ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వారవుతారని హెచ్చరించారు.

కాల్చేసినోడు రైతును కాపాడుతడా?

ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బషీర్‌బాగ్‌లో పట్టపగలు రైతులను కాల్చి చంపిన చంద్రబాబు ఇవాళ మొసలి కన్నీళ్ళు కారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది గోబెల్స్ ప్రచారమేనని దాన్ని ప్రజలు నమ్ముతారనుకుంటే మూర్ఖత్వమేనన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో విద్యుత్ ఉత్పత్తితో 54 శాతం వాటా కేటాయిస్తే ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. సీలేరు విద్యుత్‌ను ఇద్దరం పంచుకుంటామని కేంద్రానికి చెప్పి సమయానికి తెలంగాణను ఎగబెట్టారని ఆరోపించారు. నేదునూరు, శంకర్‌పల్లిలలో విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

లోకేష్ సవాలు స్వీకరిస్తాం..

ఏ మాత్రం తడుముకోకుండా ఏ అబద్ధమైనా చెప్పగల సమర్థుడు చంద్రబాబేనని ఆయన చెప్పిన లెక్కల ద్వారా మరోసారి నిరూపించుకున్నాడని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్ ట్విట్టర్‌లో చేసిన కామెంట్లపై జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మీ నాయన అన్నీ అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబుతో చర్చించడానికి తాము సిద్ధమేనని, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని లోకేష్ సవాల్‌కు ప్రతిసవాల్ విసిరారు.

మేమే కాదు… చంద్రబాబును నిలదీయడానికి, ప్రశ్నించడానికి తెలంగాణలో ప్రతి అన్న, తమ్ముడు, ప్రతి అక్క, చెల్లి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బస్సుయాత్ర పేరుతో తిరిగే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని, చంద్రబాబు మాట విని టీడీపీ జెండా పట్టుకునే ప్రతి ఒక్కరు ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్లేనన్నారు.

లక్ష రూపాయల కోసం ఛస్తున్నారన్నది బాబే…

చంద్రబాబు కాలంలోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రైతులు చచ్చిపోతే లక్ష రూపాయల కోసం చచ్చిపోతున్నారని రైతులను చంద్రబాబే ఎద్దేవా చేశారని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగినంతగా ఉన్నా కేవలం తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాల్సి వస్తుందని తాను కరెంటును కొనుగోలు చేస్తున్నాడని చెపుతున్నారన్నారు. తెలంగాణకు లైన్లు దొరకకుండా ఉండాలనే స్లాట్స్ బుక్ చేసుకున్నారని విమర్శించారు. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఉందని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు అని, పంజాబ్‌కు కూడా10 శాతం విద్యుత్ ఇస్తామని ఆనాడు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ రైతాంగాన్ని కాపాడటానికి రూ.8.50లకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు జైలుయాత్ర చేయాలి…

కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపితే ఆ పార్టీ నాయకులు భరోసా యాత్ర కాదు… జైలు యాత్ర చేయాల్సి ఉంటుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో శాంపిల్‌గా విచారణ చేస్తేనే అనేక అక్రమాలు బయట పడ్డాయని, మొత్తం విచారణ చేస్తే జైళ్లు కూడా పట్టవని అన్నారు.

ఆంధ్రాలో బొగ్గు లేకపోయినా కడప జిల్లాలోని వేమగిరి, వీటీపీఎస్, కృష్ణపట్నం తదితర ప్రాజెక్టులను నిర్మించుకుంటే ఏం చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులదేనని తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురాకపోగా కాకతీయులు, నిజాం పాలకులు నిర్మించిన చెరువుల వ్యవస్థను నాశనం చేశారన్నారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎక్కువని అన్నారు. సీమాంధ్రులు కేవలం 700 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసి గొప్పలు చెపుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 1100 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసిందని తెలిపారు.

తెలంగాణను దెబ్బ తీసేందుకే సీమాంధ్ర పాలకులు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఆంధ్రాలో ఏర్పాటు చేశారన్నారు. టన్ను బొగ్గు ధర రూ.950 ఉంటే దీనిని సీమాంధ్రకు తరలించడానికి రూ.1650 చిల్లర ఖర్చు అయిందన్నారు. దీనితో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయన్నారు. మాజీ ఎంపీ మంద జగన్నాథం మాట్లాడుతూ తెలుగువాళ్లమంతా ఒక్కటేనని పొద్దంతా చెప్పే చంద్రబాబు ఈఆర్సీ అనుమతి లేదంటూ పీపీఏలను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. తెలుగు ప్రజలపై ప్రేమ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Source: [నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *