టీఆర్ఎస్ ప్లీన‌రీకి ఏర్పాట్లు పూర్తి : మంత్రి కేటీఆర్

  • October 23, 2021 4:26 pm

ఈ నెల 25న హైటెక్స్ వేదిక‌గా జ‌రగ‌బోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఉద‌యం ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబ‌ర్ 25న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్లీన‌రీ ప్రారంభం అవుతుందని, దాదాపు 6 వేల పైచిలుకు ప్లీన‌రీ ప్ర‌తినిధుల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయన్నారు. ప్లీన‌రీ ప్రాంగ‌ణంలో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ కోసం 35 కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా 50 ఎక‌రాల్లో 8 వేల వాహ‌నాల‌కు స‌రిపోయే విధంగా పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించామ‌న్నారు.

మొద‌టి సెష‌న్‌లో అధ్య‌క్షుడి ఎంపిక‌ :

రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మొద‌టి సెష‌న్ ఉంటుంది. ఈ సెష‌న్‌లో పార్టీ అధ్య‌క్ష ఎంపిక‌, కొన్ని తీర్మానాలు ఉంటాయి. రెండో సెష‌న్ 2 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ స‌మ‌యంలో తీర్మానాల‌తో పాటు ఇత‌ర కార్య‌క్ర‌మాలు ఉంటాయి. మొత్తం 7 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంట‌ల వ‌ర‌కు భోజ‌న విరామ స‌మ‌యమని, ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే ప్ర‌తి ఒక్క‌రికి భోజ‌నాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

గులాబీ రంగు వ‌స్త్రాలు ధ‌రించాలి :

ప్లీన‌రీకి వ‌చ్చే పురుష ప్ర‌తినిధులు గులాబీ రంగు చొక్కాలు ధ‌రించాల‌ని, మ‌హిళా ప్ర‌తినిధుల‌యితే గులాబీ రంగు చీర‌లు ధ‌రించాల‌ని ఇప్ప‌టికే చెప్పామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ ఎంపిక చేసిన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఇప్ప‌టికే ఆహ్వానాలు పంపామని అన్నారు. పాస్‌లు ఇవాళ సాయంత్రం వ‌ర‌కు అందుతాయని.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ జ‌డ్పీ చైర్మ‌న్లతో పాటు పార్టీ ముఖ్యుల‌కు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మాచారం అందుతుందని కేటీఆర్ తెలియజేశారు.

అంబేద్క‌ర్ స్ఫూర్తితో తెలంగాణ‌ను సాధించాం :

ఏప్రిల్ 27, 2001న కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుందని.. ఒక ప్రాంతీయ పార్టీగా, ఉద్య‌మ సంస్థ‌గా ఆవిర్భ‌వించి రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌జ‌ల ద‌శాబ్దాల‌ ఆకాంక్ష‌ను నెర‌వేర్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధ‌న క్ర‌మంలో ఎన్నో పోరాటాలు జరిగాయని, ఎంతో మంది త్యాగాలు చేశారని కేటీఆర్ తెలిపారు. బోధించు, స‌మీక‌రించు, పోరాడు అనే అంబేద్క‌ర్ త‌త్వాన్ని పూర్తిస్థాయిలో ఆచ‌ర‌ణ‌లో పెట్టి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ‌ను సాధించి, ఇపుడు జాతీయ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను శాసించే స్థాయికి ఎదిగిందన్నారు. నేడు తెలంగాణ భార‌త‌దేశానికే దిక్సూచిగా మారింద‌ని అభివర్ణించారు. ప‌క్క రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ‌లో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపాల‌ని కోరుతున్నారని, తెలంగాణ‌లో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అద్భుతంగా అమ‌ల‌వుతున్నాయ‌ని పొరుగు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు ప్ర‌శంసిస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


Connect with us

Videos

MORE