ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం బేగంపేటలోని తన అధికారిక నివాసంలో అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఉదయం 10.48 గంటలకు కుటుంబసభ్యులతో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన గురువు మృత్యుంజయశర్మకు పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు పొందారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటున్న నంది నగర్ లోని ఇంటిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్నారు. అయితే కేటీఆర్ నివాసం మాత్రం బేగంపేటలోని సీఎం అధికారిక నివాసంలోనే. నంది నగర్ లోని ఇంట్లో ప్రతిరోజూ ఉదయం 8గంటలనుండి 10గంటలవరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
వాస్తవానికి వాస్తుదోషం కారణంగా బేగంపేటలోని అధికారిక నివాసానికి మారేందుకు సీఎం విముఖత వ్యక్తం చేశారు. దీనితో కుందన్ బాగ్ లోని మంత్రుల క్వార్టర్లలో రెండింటిని అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని సందర్శించిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్ళీ బేగంపేటలోని అధికారిక నివాసాలకు సీఎం సూచన మేరకు వాస్తు మార్పులు చేసి ఆదివారం గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులతో పాటు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దంపతులు, కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు, నమస్తే తెలంగాణ సీఎండీ రాజం దంపతులు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.