
హైదరాబాద్: వ‌్యవసాయానికి 24 గంటల కరెంట్ అక్కర్లేదు.. 3 గంటలు ఇస్తే సరిపోతుందని అమెరికాలోని తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం భగ్గుమంటున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ నోటికాడి బుక్కను లాగేసేందుకు హస్తం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. వాళ్లను ఊళ్లోకి అడుగుపెట్టనియ్యబోమని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ దురహంకార వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు రైతు సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీపైనా దుమ్మెత్తిపోస్తున్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఓబులాయపల్లిలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సభలో దేవమ్మ అనే వృద్ధురాలు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడింది. రైతులకు 3 గంటల కరెంటు ఎట్లా సరిపోతుందని నిలదీసింది. కేసీఆర్ సార్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే మీరు అడ్డంపడతరా? అంటూ విరుచుకుపడింది. మళ్లొకసారి మూడు గంటల కరెంట్ అని మాట్లాడితే రేవంత్‌రెడ్డికి తన చేతికర్రతో బడితెపూజ చేస్తానని హెచ్చరించింది. రైతులను అవమానించిన కాంగ్రెస్ మాకొద్దని.. బీఆర్ఎస్‌కు.. కేసీఆర్‌కే మళ్లా ఓటేస్తామని పేర్కొనడంతో సభలో ఉన్న రైతులందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు.