“ఒకరంటే ఒకరికి పడకపోతే అన్నదమ్ములే విడిపోతున్న ఈ రోజుల్లో ఇష్టం లేకుండా రెండు ప్రాంతాలు ఎలా కలిసుంటాయి? తెలంగాణకు సీమాంధ్రతో బలవంతంగా పెళ్ళి చేసిన నెహ్రూ, అవసరమైతే విడాకులు తీసుకోవచ్చని ఆనాడే చెప్పారు. సరిగ్గా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 29న నిర్వహిస్తున్న సకల జనభేరికి జనం లక్షలాదిగా తరలి రావాలె” అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సకల జనభేరి కొరకు భారీ సన్నాహక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఆవరణలో జరిగిన సభలో కోదండరాం మాట్లాడారు.
సంఘటితంగా పోరాడితే ఏ శక్తీ తెలంగాణను అడ్డుకోలేదని ఆయన అన్నారు. మెదక్ జిల్లా అంటేనే పోరాటమని నిరూపించిన కానిస్టేబుళ్ళు శ్రీనివాస్,శ్రీశైలం ల తెగువను కోదండరాం మెచ్చుకున్నారు.
సీమాంధ్ర చానళ్ళను, పేపర్లను పట్టించుకోవద్దని, వాటిల్లో వచ్చే వార్తలను చూసి ఆందోళనకు గురి కావొద్దని ఆయన సూచించారు. ఇక తెలంగాణ రాదని, అడ్డుకుంటామని, తీర్మానాన్ని ఓడిస్తామని, ఇలా అనేక రకాలుగా చేస్తున్న ప్రచారాలను చూసి బెదిరిపోవద్దన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా,ఎన్ని రకాలుగా అడ్డుపడినా తెలంగాణ ఏర్పాటును మాత్రం ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.