mt_logo

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని మోసగించిందెక్కడ?

కాంగ్రెస్ లో గల్లీ లీడర్ మొదలుకొని డిల్లీ లీడర్ వరకూ ఒకటే ఏడుపు. కేసీఆర్ తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేశాడని.

అసలు నిజంగా అలా జరిగిందా. కేసీఆర్ విలీనంపై అసలేమన్నాడు, ఎప్పుడన్నాడో ఒకసారి చూద్దాం.

2009 మొదలుకొని 2012 వరకూ నెలల తరబడి జేయేసీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమించినా కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నానుస్తూ వచ్చారు. ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు.

దసరా తరువాత అని, దీపావళి తరువాత అని, బక్రీద్ తరువాత అని ఒక నాయకుడు అంటే, ఇంకొక నాయకుడు తెలంగాణనా? అదెక్కడుంది అని ఎకసెక్కాలాడారు. మరొక నాయకురాలు తెలంగాణ అంటే కుక్కర్ లో అన్నం ఉడకబెట్టడం కాదని, ఒక నాయకుడు ఇన్స్టంట్ కాఫీ కాదు, మరో నాయకుడు దోసె వేయడం కాదని….మరో ప్రభుద్ధుడేమో వారం అంటే వారం కాదని, నెల అంటే నెల కాదనీ…ఒకటా రెండా…తెలంగాణ ప్రజలను అనునిత్యం అవమానించారు కాంగ్రెస్ నాయకులు.

ఇలా వీరు డొంక తిరుగుడు మాటలు మాట్లాడిన ప్రతిసారీ ఓ పది ఇరవై ప్రాణాలు గాలిలో కలిసేవి తెలంగాణలో.

ఈ అమానుషకాండ  ఎడతెగకుండా కొనసాగుతుండటంతో విసిగి వేసారిన కేసీఆర్ ఏదో ఒకటి తేల్చుకుందామని 2012 సెప్టెంబర్ లో డిల్లీ బాట పట్టాడు.

డిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో తెలంగాణ రాష్ట్రం తొందరగా ఇవ్వండని, అవసరమైతే తన పార్టీని విలీనం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని మంతనాలు మొదలుపెట్టాడు.

కానీ కాంగ్రెస్ పెద్దలు ఎప్పటి లాగానే తిరకాసులు పెట్టారు. మొదలు పార్టీని విలీనం చేస్తే తెలంగాణ సంగతి తరువాత చూద్దామని అతితెలివి ప్రదర్శించారు.

కనీసం సోనీయా గాంధీతో కేసీఆర్ ను నేరుగా మాట్లాడనివ్వలేదు.

వారాల తరబడి కేసీఆర్ డిల్లీలోనే ఉండి ప్రయత్నించినా కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

అన్ని రకాలుగా ప్రయత్నించినా కాంగ్రెస్ తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో కేసీఆర్ నిరాశతో డిల్లీనుండి తిరిగొచ్చిండు.

వచ్చిన కొద్ది రోజులకే పార్టీ సమావేశం ఏర్పాటుచేసి కాంగ్రెస్ పై యుద్ధభేరిని మోగించాడు. కాంగ్రెస్ ను పాతరవేస్తానని ప్రతిన బూనాడు.

చివరికి కాంగ్రెస్ తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుటున్నప్పుడు కూడా కేసీఆర్ ను ఏనాడు సంప్రదించలేదు. విలీనం గురించి మాట్లాడనూ లేదు. అంతే కాదు తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన నాడు ఇక కేసీఆర్ తో తమకేం పని లేదని, రేపటి నుండి కేసీఆర్ ఇంటివద్ద పురుగు కూడా ఉండదని కాంగ్రెస్ నాయకులు బీరాలు పలికారు.

ఇదీ జరిగిన వాస్తవం.

ఇందులో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని మోసగించిందెక్కడ?

అయినా ఆరు దశాబ్దాలు తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ మీద పడి ఏడవడమే విడ్డూరం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *