mt_logo

ఆంక్షలు లేని తెలంగాణ కావాలి-కేసీఆర్

గత మూడు రోజులుగా టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు ఢిల్లీలో ప్రధాని, అన్ని పార్టీల జాతీయ నాయకులను కలుస్తూ తెలంగాణకు మద్దతు కూడగడుతున్నారు. మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన కేసీఆర్ తెలంగాణ బిల్లులో కొన్ని అంశాలు తెలంగాణకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వాటిని సవరించి సంపూర్ణ తెలంగాణను ఇవ్వాలని ఒక విజ్ఞాపన లేఖను ప్రధానికి ఇచ్చారు. అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించి బిల్లు ఆమోదానికి కేంద్రం సిద్ధంగా ఉందని, విడిపోయినా కలిసిమెలిసి ఉండండి అని కేసీఆర్ కు చెప్పారు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు మూజువాణి ఓటుతో ఏర్పడ్డాయని, సీమాంధ్ర నేతలు సభను సజావుగా జరగనిచ్చేట్లు కనపడక పోవడంతో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటు ద్వారా ఆమోదంపొందేట్లు చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిసింది. ప్రధానితో సమావేశం అనంతరం కేసీఆర్ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలిసి తెలంగాణ అంశంపై చర్చించారు. తెలంగాణ సాధించేవరకు అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉండాలని, తెలంగాణ విషయంలో సోనియాగాంధీ, కేంద్రప్రభుత్వం పట్టుదలగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన పని లేదని జైపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ కూడా బిల్లు పాస్ అవుతుందని కేసీఆర్ కు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. తప్పనిసరి అయితే మూజువాణి ఓటుకు అయినా తాము సిద్ధమేనని కమల్ నాథ్ అన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *