mt_logo

12 వేల క్రాసింగ్స్ దాటుతూ వాటర్ గ్రిడ్ పైప్ లైన్ల నిర్మాణం!

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తాగునీటి పథకం(వాటర్ గ్రిడ్) అమలు చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అడవులు, రైలు, రోడ్డు మార్గాలు, వాగులు, వంకల మీదుగా ఊరూరికీ పైపులు వేసి అన్ని ఊర్లకు తాగునీటిని అందించాలి కాబట్టి క్లిష్ట మార్గాల్లో పైపులు వేయాలంటే అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఈ ఆటంకాలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసింది. అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమావేశమై పక్కా ప్రణాళికను రూపొందించింది. వాటర్ గ్రిడ్ మార్గాలకు సుమారు 12 వేల క్రాసింగ్స్ ఎదురవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా అనుమతులపై ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

పంచాయితీ రాజ్, ఆర్అండ్ బీ శాఖల రహదారుల క్రాసింగ్స్ కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంకా కేంద్రం ఆధీనంలోని రైల్వే, అటవీ శాఖల అనుమతులు రావాల్సిఉంది. వాటర్ గ్రిడ్ పథకం కోసం రైల్వే లైన్లు ఉన్న ప్రాంతాల్లో మొత్తం 311 క్రాసింగ్స్ ఎదురవుతాయని అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు రైల్వే శాఖ నుండి అనుమతులు తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జాతీయ రహదారుల గుండా పైప్ లైన్లు వేసే సమయంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా ఈ పనులు సాగనున్నాయి. రోడ్డును తవ్వకుండానే రోడ్డు కింద సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి పైపు లైన్లు వేస్తారు. 537 ప్రాంతాల్లో జాతీయ రహదారులను, 4006 చోట్ల ఆర్అండ్ బీ రోడ్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. 6715 చోట్ల పంచాయితీ రాజ్ రోడ్ల గుండా పైప్ లైన్లు వెళ్లనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *