mt_logo

విషంగక్కుతున్న కాలకూటమి

By రమేశ్ హజారి

కాంగ్రెస్ టీడీపీ కూటమిని కాలకూటమిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ఈ కూటమిని ఇట్లనే ఒదిలిపెడితే తెలంగాణనంతటిని దహించివేసే ప్రమాదమున్నది. ఈ ప్రమాదకర కూటమికి తెలంగాణ ఓటరు తప్పకుండా అడ్డుకట్ట వేస్తడు.

తెలంగాణ ఉద్యమాన్ని మేం తల్చుకుంటే ఉక్కుపాదంతో అణిచివేసేవాల్లం. కశ్మీర్ తీవ్రవాదాన్ని తొక్కిపెట్టిన కాంగ్రెస్‌కు తెలంగాణ పోరాటం వో లెక్కా.. అంటూ కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద, వారి త్యాగాల మీద దాడి, అవహేళన తప్ప మరొకటికాదు. కాంగ్రెస్‌కు తెలంగాణ మీద ప్రజల బాగోగుల మీద కంటే, అధికారం మీది యావేనని తేలిపోయింది. గోతికాడి తోడేల్లను తలపిస్తున్న కాంగ్రెస్‌లో పెద్దల ముసుగేసుకున్న గుంటనక్కల అసలు స్వరూపాలు రోజుకోటి బయటపడుతున్నవి. నాటి నెహ్రూ నుంచి నేటి రాహుల్ దాకా అరువై యేండ్లుగా తెలంగాణ ప్రజల అరిగోసను పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం పోరాడిన వందలాదిమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నది. కేసీఆర్ టీఆరెస్‌ను స్థాపించి, జాతిమొత్తాన్ని కదిలించి పోరాడితే తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్, దయతలిచి తెలంగాణను దానం చేసిందట! అధికారం కోసం ఎంతకయినా తెగిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నైజాన్ని తెలుపుతున్నది. ప్రజల త్యాగాలను అవహేళన చేస్తూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడిన మాటలు, రేపటి ఎన్నికల్లో కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలకే వస్తే సస్తే ఎలా వ్యవహరిస్తదో అర్థమవుతున్నది. మేం అధికారంలకు వస్తే మిమ్ములను ఒదలిపెట్టమని ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ ఇప్పటికే ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటనలు చేస్తున్నడు. తెలంగాణ వచ్చిన కొత్తలో, ఉపఎన్నికల సందర్భంలో మాకు ఓటేయకుంటే తెలంగాణను తిరిగి ఆంద్రాలో కలుపుతం అని ఓ సీనియర్ నేత ప్రజలను బెదిరించిన సంగతి మనం మరిచిపోలేదు. ఇట్లా.. అటు అధికారులను ఇటు ప్రజలను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదికారంలకు వస్తే తెలంగాణ గతి మల్లా నిజాం కాలం నాటి పాలనను తలపించడం ఖాయమని జనం భయపడుతున్నరు.

ప్రజల చేత తిరస్కరించబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్మాద స్థితికి చేరుకున్నది. బుద్ధిమంతులెవరైనా వారి తప్పును ఎవరైనా గుర్తించి చెప్పితే, దాన్ని సరిదిద్దుకోని ప్రజల మన్నన పొందుతారు. కానీ.. కాంగ్రెస్ ప్రజలనే బెదిరించే స్థితికి చేరుకున్నది. వలసవాద నేతలతో కలిసి తెలంగాణను తెర్లు చేయడానికి కుట్రపన్ని రెడ్ హాండెడ్‌గా దొరికిన బ్రోకర్లు, తమ తప్పు తెలుసుకుని చెంపలేసుకుని ముక్కునేలకు రాసి బుద్ధిమంతునిగా మారకుండా కేసీఆర్ మీద ద్వేషం పెంచుకున్నరు. పక్కనోడు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని తనంతో నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నరు కాంగ్రెస్ నేతలు. పనిచేసే వారిని చెడగొట్టే దుష్ట ఆలోచనతో వున్న కాంగ్రెస్ ఏ విషయంలోనూ పాజిటివ్‌గా ఆలోచించటం లేదు. తెలంగాణను తెర్లు తెర్లు చేసి పోయిన ఆంధ్రాపార్టీని, తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన టీడీపీతో పొత్తులు పెట్టుకొని పక్కలో బల్లెంగా మల్లా తెచ్చిపెట్టేందుకు సిద్ధమైతున్నది కాంగ్రెస్. మన సాగు నీటిని మనం పారిచ్చుకుందానికి ఆనకట్టలు కట్టుకుంటాంటె అడుగడుగునా అడ్డుకుంటూ కోర్టు కేసులేస్తున్న టీడీపీతో చేతులు కలుపుతున్నది. మన ఉద్యోగులను మనకు దక్కనీయకుంటా, మన హైకోర్టును మనకు రానీయకుండా, మనకు దక్కాల్సిన షెడ్యూల్ 9 ,10 సంస్థల ఆస్తులను మనకు కానీయకుండా, మొత్తంగా మన విభజన హక్కులను మనకు దక్కనీయకుండా అడుగడుగునా అడ్డంపడుతున్న టీడీపీతో పొత్తుపెట్టుకుంటన్నది కాంగ్రెస్ పార్టీ. ఇన్నాల్లు వలసవాదులకు లొంగి ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపటి తెలంగాణను తిరిగి వాల్లకే అప్పచెప్పడానికి సిద్ధమైన సంగతిని సగటు తెలంగాణ బిడ్డ అర్థం చేసుకుంటున్న సందర్భమిది.

తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తెలంగాణలో పాగా వేయాలనే కుట్రలకు పదునుపెట్టిండు చంద్రబాబు. చట్టవిరుద్ధంగా తెలంగాణలో ఏపీ పోలీసులతో సర్వే చేయించడానికి బరి తెగించింది ఆంధ్రా టీడీపీ ప్రభుత్వం. వారి తొత్తులు గనుక ఇక్కడ తెలిస్తే మన ప్రాజెక్టులను ఎక్కడివక్కడ పండపెట్టి మన నదీజాలలను మలుపకపోవడం ఖాయం. మన ఆస్తులనూ మన సంస్థలనూ మన హైద్రాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్న కార్పోరేట్ సంస్థలనూ మలుపుక పోవడం ఖాయం. హైద్రాబాద్‌ను తిరిగి ఆంధ్రా అడ్డగా మార్చి ఈ అమ్ముడుపోయిన కాంగ్రేస్ నాయకులను తమ బానిసల్లాగా మార్చుకొని వాల్ల బ్రోకర్లతో తెలంగాణను మల్లా కోలుకోకుంట చేసుడు ఖాయం. తమకు కావాల్సిన స్థానాలను తమకు కేటాయిస్తే చాలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో సహా మొత్తం ఎన్నికల ఖర్చు నాదేనంటూ చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన ఆఫర్ మేరకే ఈ కాలకూటమి పొత్తులు పొడుస్తున్నయి. ఎన్నికలకు ముందేటోకుగా అమ్ముడుపోయిన కాంగ్రెస్ నేతలు రేపటి తెలంగాణను బాబుకు గుండుగుత్తగా అమ్ముకోవడం ఖాయం. ఇటువంటి దుర్మార్గపు పరిస్థితులకు అడ్డుకట్టవేయాలి. త్యాగాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణను పరుల పాలు కానిచ్చుడు లేదు. టీఆర్‌ఎస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్‌ను మల్లా ముఖ్యమంత్రిని చేసుకోని దాదాపు నిర్మాణం పూర్తికావచ్చిన సాగునీటి ప్రాజెక్టులను ఆయింత పూర్తి చేసుకుందాం. ఆసరా, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగించుకుందాం. కాలకూటమి వంటి కాంగ్రేస్, టీడీపీ పార్టీల అనైతికి కూటమిని తిరస్కరిద్దాం. పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణను తెచ్చి నాలుగేండ్ల కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయిల నిలబెట్టిన మఖ్యమంత్రి కార్యాచరణకు అండగా నిలుద్దాం.

అరువయేండ్ల సంది మనల్ని అరిగోస పెట్టింది కాక తీర తెలంగాణ తెచ్చుకోని కష్టపడి నిలవెట్టుకుంటాంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మల్లా తీసుకపోయి ఆంధ్రోల్లకు తాకట్టుపెట్టేందుకు సిద్ధమైతున్నకాంగ్రెస్ పార్టీ కాలకూటమిని ఓడిద్దాం. ఉద్యమకాలంలో ఆంధ్రా వలసపాలకులు ఎంతగా మభ్యపెట్టినా ప్రలోభాలకు గురిచేసినాగని లొంగకుంటా బెదరకుంటా ఉద్యమపార్టీ టీఆరెస్‌ను నిలవెట్టుకున్నం కావట్టే తెలంగాణ నెగ్గింది. ప్రతి ఎన్నికలో కేసీఆర్‌కు పూర్తి విశ్వాసం కల్పించినం కావట్టే తాను ధైర్యంతో వలసపాలనను తరిమికొట్టగలిగిండు. తెలంగాణను నిలబెట్టుకోగలిగినం. తెలంగాణ రావడం తోటి వలసవాద శత్రువు పారిపోయిండు కానీ కాంగ్రేస్ రూపంలో అంతర్గత శత్రుశేషం మిగిలేవున్నదని జనం గ్రహిస్తున్నరు. కాంగ్రెస్ నేతల చేష్టలతోని మాటలతోని వాల్లకు తెలుస్తూనే ఉన్నది. ఇవాల తెలంగాణలో మహాకూటమి పేరుతో తయారయితున్న కాలకూటమి కూడా మిగిలిన శత్రుశేషంలో భాగమేనని జనం గ్రహిస్తున్నరు. కాంగ్రెస్ టీడీపీ కూటమిని కాలకూటమిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ఈ కూటమిని ఇట్లనే వొదిలిపెడితే తెలంగాణనంతటిని దహించివేసే ప్రమాదమున్నది. ఈ ప్రమాదకరకూటమికి తెలంగాణ వోటరు తప్పకుండా అడ్డుకట్ట వేస్తడు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *