mt_logo

విగ్రహ విధ్వంసతత్వం

– అల్లం నారాయణ

మాప్రాజెక్టుల్లో రాళ్లు మొలిచాయి. శంకుస్థాపన శిలలు. మా బతుకులలాగా కఠినమైనవి. ఒకరి తర్వాత ఒకరుగా వేసిన రాళ్లకుప్పలు. వరదకాలువా రాలేదు. దేవదుంల పేలుతున్నది. పేర్లెందుకు నీళ్లు నింపాల్సిన ప్రాజెక్టులు మా కళ్లనిండుగా కన్నీళ్లు నింపాయి. మీకు వరదలొస్తాయి కావొచ్చు. మావి కన్నీటి వరదలు. విచిత్రం మా ప్రాజెక్టులకు శంకుస్థాపన రాళ్లు వేసిన వారి విగ్రహాలు మా వీధుల్లో మొలిచాయి. విగ్రహాల వనం కిక్కిరిసిపోయింది. చెయ్యిచూపేవాడో? దారి చూపేవాడో? కానీ మా అంతరంగాల్లో గూడుకట్టుకున్న దుక్కాన్ని ఆర్పేవాడెవడూ లేడు. ప్రతివాడూ అతను మీ వాడే. మాకు జిందగీ అంతా నల్లసరబ్బండలాంటి లేని భవిష్యత్‌కు పునాదులు వేసిన వాళ్ల విగ్రహాల మంద. జీవితం అసంబద్ధంగా ఉంటుంది. సత్యం తారుమారుగా ఉంటుంది. ఎందుకంటే మీరు సత్యాలు ప్రవచించేవాళ్లు, మేము సత్యాన్ని కంటూ కూడా కనిపెట్టలేని వాళ్లంగా ఉన్నవాళ్లమని కదా! మీ దురహంకారం. మీ ఆధిపత్యం.

చంద్రబాబు ఒక మార్మికతుపాకి. చంద్రబాబు ద్వంద్వ యుద్ధాలు చెయ్యడు. తెరచాటున ఆయన కుట్రలు చెయ్యగల దిట్ట కావొచ్చుగాక. వెన్నుపోట్లనూ, పడిపోయిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్యాన్నీ ఆర్గనైజ్ చెయ్యగల మంచి ఆర్గనైజర్ కూడా కావొచ్చు. కానీ ఆయన విగ్రహ విధ్వంసకుడు కాదు. అతను విగ్రహాలను కూల్చడు. కానీ ఇప్పుడు చంద్రబాబుకు అర్జంటుగా వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూల్చాలనిపిస్తున్నది. దాచుకోవడానికి ఏమీలేదు. కమ్మవారు ఏలుతున్న ఒక మహా సామ్రాజ్యాన్ని, అది దశదిశలా తెలంగాణలోనూ కులాన్ని గెలిపించుకొని, విగ్రహాలు ప్రతిష్టించుకోవాల్సినంత పాతుకుపోయింది. తెలంగాణలోనూ కులం ప్రతిమై నిలిచింది. ఆ సామ్రాజ్యాన్ని కూల్చినవాడు రెడ్డి.

వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి. ఆయనదీ రాయలసీమే. సహజమే కులం ఒక భారతీయ సామాజిక వాస్తవికత. నిజమే కాపులు అడ్డంపడి రెండోసారీ కమ్మల ఆధిపత్యానికి గండి కొట్టారు. అట్లాంటి వై.ఎస్.రెడ్డి విగ్రహాలను చూస్తేనే చంద్రబాబుకు చిర్రెత్తుకు రావడం. వై.ఎస్. పందిలా తోచడం స్వయంగా వీటిని తక్షణమే కూలగొట్టాలనుకోవడం, పట్టరాని కోపం రావడం, ఉక్రోషం పెరగడమూ సహజమే. వై.ఎస్. విగ్రహాలు ఎందుకు కూల్చాలో? చంద్రబాబు వేరే కారణాలు చెప్పవచ్చు. ఆయన అవినీతిపరుడు, రాష్ట్రాన్ని దోచి దొంగలపాలు చేసినవాడు ఎట్లా గొప్పవాడౌతాడు? అతని విగ్రహాలేమిటి? అని కూడా అని వుండవచ్చుగాక. కానీ చంద్రబాబు మార్మికుడు కూడా. వెన్నుపోటు పొడిచే దాకా ఎన్టీఆర్‌కు కనీసం అజాకూడా లేకుండా, కత్తి కనబడకుండా మార్మికంగా ఆర్గనైజ్ చేసినవాడు. వైస్రాయి హోటల్‌కూ, చంద్రబాబు ఆర్గనైజేషన్ స్కిల్స్‌కూ, చంద్రబాబు అంతరంగపు అవగాహనకూ సంబంధం వుండే ఉంటుంది కనుక. ఆయన పైకి చెబుతున్న దేదీ సత్యం కాకపోవచ్చు. మామనుంచి లాక్కున్న అధికారాన్ని ఇరవైఇరవైదాకా ఉండాల్సిన అధికారాన్ని రెడ్డి లాక్కున్నాడన్న ఆక్రోశమూ ఉండవచ్చు. కానీ…
చంద్రబాబు ఒకటి దాస్తున్నాడు. ఎన్టీఆర్‌ను గద్దెదించి, హోటల్‌వద్ద చెప్పులు విసిరి తరిమిన చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహారాధకుడయ్యారు. ఎన్టీఆర్ దేనికి ప్రతీక. ఒక కమ్మ సామ్రాజ్యానికా? చంద్రబాబులాంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ కలిగిన రాజకీయవేత్తకు అధికారం సాధించి పెట్టే ప్రతీకా? ఎన్టీఆర్ బొమ్మలు ఊరూరా ఎందుకు వెలిసినట్టు? ఒక విగ్రహాన్ని ప్రతిష్టించడం, మరో విగ్రహాన్ని కూలగొట్టడం, నిగ్రహం లేకుండా చిర్రుబుపూరులాడుతూ సుత్తీ, పారా, పలుగూ ఇస్తే విగ్రహ విధ్వంసయాత్ర చేసేంత, అదీ చంద్రదండు, కిరణ్‌కుమార్‌రెడ్డి పంపిన పోలీసుల సహాయంతో విగ్రహ విధ్వంసం నెరవేర్చేంత ఆవేశం ఎందుకు వచ్చినట్టు… ఇదీ అసలు సమస్య.

మాకు ముఖమే లేకుండా చేశారు. మా ముఖాలు ఏ వీధి మొదట్లోనూ మొలవకుండా చేశారు. అడ్డం పొడుగూ పెరిగిన పొట్టకు బెల్టుపెట్టి, తుపాకి రాముడిలా దిమ్మడదమ్మడ ఎగిరి, కూతురి వయసున్న హీరోయిన్లతో ‘ఆకుచాటు పిందె తడిసె’ననో? చిలుకకొట్టుడు కొడితే చిన్నదానా, అనో వేటగాడో? వేషగాడో తెలుగుజాతి ఆత్మగౌరవపు ప్రతీక అయి ఊరేగుతుంటే నిశ్శబ్దంగా మా పోటెత్తిన పోరుపాట నెత్తురోడింది. తెలుగు సంస్కృతి అంటే ఆదే మా తెలుగు మూర్తి నిక్షిప్త ప్రాంగణం అన్నంత మాత్రాన మేము అణగారిన మూలుగులు వినిపించలేదు. అదొక మహావైభవం. ఆ తెలుగుజాతి ఆత్మగౌరవం కొనసాగింపే కదా! చంద్రబాబు మార్మిక తుపాకి దెబ్బకు సొమ్మసిల్లి చేతివృత్తుల సడుగులిరిగి.. చివరికి ఈ జనారణ్యంలో శిల్పారామంలో పురావస్తు కళావూపదర్శనల పాలయింది. తెలుసా? చేతివృత్తులు ఇప్పుడు పరికరాలను వింతగా చూసి తరించే గతించిన గతం. కానీ విగ్రహాలు పెట్టుకున్న వాళ్లకూ ఇప్పుడు విగ్రహాలమీద కోపం రావడమే అసలు విషయం.

ఇప్పుడు మాట్లాడతానొక స్వేచ్ఛాగానంవలె. ట్యాంక్‌బండ్ గురించీ.. మిలియన్ మార్చ్ గురించి.. విగ్రహ విధ్వంసం గురించి ఏమన్నారు మీరు తాలిబన్లని.. ఏమన్నారు మీరు. సంస్కృతీ విధ్వంసకులని. ఏమన్నారు మీరు అనాగరికులమని. ఒక కుల సామ్రాజ్యం కూలిపోయి, మరో కుల సామ్రాజ్యం ఏర్పడినందుకే చంద్రబాబు విగ్రహాలను కూల్చమన్నాడే. ఏమనాలి? తెలంగాణ. మా సంస్కృతిని కూల్చి, మా బతుకులను కూల్చి, ఉద్యమాలను మరుగుపరచి.. కన్నీళ్లూ నెత్తురూ ప్రవహించిన మా పోరాట వారసత్వాన్ని మైమరిపించి కాకతీయులనుంచి, హుస్నాబాద్ స్థూపందాకా అనేకుల చరివూతను, సంస్కృతిని కూలదోసి.. మీ శిలా స్మరణలకోసం ఏర్పాటు చేసిన సంస్కృతీ విధ్వంసకుల విగ్రహాలను మేమెట్లా భరించాలి. నిజమే ట్యాంక్‌బండ్‌మీద కూకున్న విగ్రహాలు తెలుగు అంటావు. అవుతాయా? కానీ ఆ విగ్రహాల క్రింద, ఆ విగ్రహాల ప్రతిష్ఠాపన వెనక మీ ఆక్రమిత, ఆధిపత్య స్వభావాన్ని కూల్చివేసిందే మిలియన్ మార్చ్. ఫుజూల్‌గా విగ్రహ విధ్వంసాల గురించి మాట్లాడే చంద్రబాబును ఏమందాం. ఒక ఉక్రోశం, ఒక ఆక్రోశం. తనకు కాకుండా పోయినదాన్ని కూల్చివేయాలనే తాపత్రయం . దానికి తెలుగుజాతి ఆత్మగౌరవం పేరు.కానీ… తెలుసా? నలభై మూడు సంవత్సరాల క్రితం మున్నూటా డెబ్భై మందిని రాజ్‌భవన్‌రోడ్‌లో కాల్చి చంపిన వాడు తెలంగాణలో దేనికి ప్రతీక. చిరాన్‌పార్క్ కేబీఆర్ ఎట్లయింది. కాసు బ్రహ్మానందరెడ్డి మా హైదరాబాద్‌లో విగ్రహం ఎట్లా అయ్యిండు. ఒక రక్తపిపాసి విగ్రహాన్ని తెలంగాణ ఎట్లా భరిస్తుంది. ఎటుచూస్తే అటు నాటుకుంటూ పోయిన మీ విగ్రహాలను మా కనుప్పల కింద దాగిన దు:ఖపు ఉప్పెన ఎట్లా భరిస్తుంది?

లీడర్‌షిప్, పాపులారిటీ, ఛరిస్మా, స్టార్‌డమ్‌లు ప్రజాస్వామ్యంలో అవాంఛనీయ గర్భాలు. అవికన్న వికృత శిశువులే ఇవ్వాల్టి వీధుల్లో విగ్రహాలు. ట్యాంక్‌బండ్ మీద కొన్ని విగ్రహాలకూ దీనికీ సంబంధం లేకపోవచ్చు. కానీ.. ఒక ఆధిపత్యంకోసం.. తెలంగాణ ఉనికినీ, అస్తిత్వాన్నీ, త్యాగాన్నీ, చరిత్రనూ, సంస్కృతిని, జీవనాన్ని విధ్వంసం చేసినవారే సంస్కృతీ పరిరక్షకులుగా పెదాలమీద ద్వంద్వాలు పలకడం విరోధాభాస. సంస్కృతిని ధ్వంసం చేసినవాడు.. ఒక మార్మిక హంతకుడు సంస్కృతీ ప్రవచనాలు వల్లించడం విరోధాభాస. ‘ఆకుచాటు పిందెతడిసె’ అల్ప సంస్కృతీ, హీన కళల వల్లభుడు.. భువిన వెలిగించిన క్షణాల్లోనే, అవసరార్థం వెన్నుపోటు పొడిచి, భౌతికకాయాన్ని స్వప్రయోజనార్థం విగ్రహం చేసినవాడే ప్రజల కనుకొలుకుల విస్ఫులింగాల ప్రజల పాటపై తూటా పేల్చిన మార్మిక హంతకుడు. అందుకే ప్రజాస్వామ్యమూ, మేధావిత్వమూ, బుద్ధి కుశలతకూడా మీరు ప్రవచించే సత్యంలాగే తారుమారుగా ఉంటుంది. విగ్రహాలు విరిగిపడ్తాయి. మీలా తుచ్ఛమైన ప్రయోజనాలకోసం కాదు. ఎవడిని వాడు రక్షించుకోవడానికి. ఎవడి సంస్కృతిని వాడు జెండా గద్దెమీద నిలుపుకోవడానికి.. బహుపరాక్. వై.ఎస్. విగ్రహాలూ కూలతాయి. ఎన్టీఆర్ విగ్రహాలు కూలుతాయి.. మా స్మృతులు మొలుస్తాయి. అవి ప్రజల మనుషులవి. ప్రజల్లో జీవించిన వాళ్లవి… అందుకు ట్యాంక్‌బండ్ ఒక సాక్ష్యం. ముందస్తు హెచ్చరిక.

– నమస్తే తెలంగాణ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *